- టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మెగా ఈవెంట్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ విధానాలను ఆచరణలోకి తెచ్చి క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను సాధించిన అనుభవాలను పంచుకునేందుకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు ‘నేషనల్ పాలసీ కాన్‌క్లేవ్’ను ఘనంగా నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ఈ మెగాఈవెంట్ జరుగనుంది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఎలా చేరువయ్యాయనే అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ థింక్ ట్యాంకులు, కార్పొరేట్ సంస్థలు, సివిల్ సొసైటీలకు చెందిన దాదాపు 30 ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి సంస్థలు పాల్గొననున్నాయి. ఆయా సంస్థలు తాము అమలు చేసిన విధానాలు, ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలను ఇక్కడ వివరించనున్నాయి.ఈ కాన్‌క్లేవ్‌లో 100 మందికి పైగా యువ పాలసీ ప్రొఫెషనల్స్ పాల్గొననున్నారు. వివిధ రంగాల్లో అమలవుతున్న విధానపరమైన ప్రక్రియలపై అధ్యయనం చేసి నివేదికలను సమర్పించనున్నారు.

