
బాసర, వెలుగు : బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. సోమవారం నుంచి అక్టోబర్ రెండు వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజైన సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గణపతి పూజ, సుప్రభాతసేవలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు.
సరస్వతీదేవి, లక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు మహాభిషేకం, అలంకరణ, మంగళహారతులు మంత్రపుష్పం నిర్వహించి 9 గంటలకు విఘ్నేశ్వరపూజ, క్షేత్రపూజ, అంకురార్పణ, ఘటస్థాపనతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.
సోమవారం అమ్మవారిని శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి సన్నిధిలో మొదటిసారిగా తొమ్మిది రోజుల పాటు శ్రీచక్ర అర్చన నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలను రంగు రంగుల విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు.
ఈ నెల 29న ఆలయంలో ప్రత్యేక పూజలు
అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ నెల 29న భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్న ఈవో అంజనీదేవి తెలిపారు. వీఐపీ ప్రత్యేక అక్షరాభ్యాస క్యూలైన్‌తో పాటు సాధారణ అక్షరాభ్యాస, సర్వసాధారణ దర్శన క్యూలైన్, ప్రత్యేక దర్శన క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
యాదగిరిగుట్టలో...
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇయ్యాల్టి నుంచి అక్టోబర్ 2 వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఉత్సవాల సందర్భంగా శివాలయంలో నిత్యం నిర్వహించే ‘రుద్రహోమం’ను అక్టోబర్ 2 వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. నవరాత్రి పూజల్లో పాల్గొనే భక్తుల కోసం టికెట్ ధరను రూ.1,116గా నిర్ణయించారు. ఈ టికెట్‌పై తొమ్మిది రోజుల పాటు పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించగా.. దంపతులిద్దరిని మాత్రమే అనుమతించనున్నారు.