రాష్ట్రంలో నక్సలిజం పూర్తిగా నశించింది: వరంగల్ పర్యటనలో డీజీపీ సీవీ ఆనంద్

రాష్ట్రంలో నక్సలిజం పూర్తిగా నశించింది: వరంగల్ పర్యటనలో డీజీపీ సీవీ ఆనంద్
  • గతేడాది మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు
  • వారిని జన జీవన స్రవంతిలో కలపడమే మా ముందున్న సవాల్
  • మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలే ప్రధాన సమస్యలు

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో నక్సలిజం పూర్తిగా నశించిందని, సమాజంలో ఇప్పుడు డ్రగ్స్, సైబర్ నేరాలే ప్రధాన సమస్యగా మారాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 30 ఏండ్ల పాటు నక్సలిజంపై పోరాటం చేశామని, గత ఏడాది కాలంలో కొంత మంది మావోయిస్టులు చనిపోగా, పార్టీ కీలక నేతలు, ఇతర క్యాడర్ లొంగిపోయారని చెప్పారు. వారిని జన జీవన స్రవంతిలో కలపడమే తమ ముందున్న సవాల్ అని తెలిపారు.

వరంగల్  కమిషనరేట్ లో రెండో రోజు ఆదివారం పర్యటించిన ఆయన ఎన్ఐటీలో టీజీన్యాబ్, సైబర్  సెక్యూరిటీ బ్యూరో, సీసీటీఎన్ఎస్, సీఐడీ, ఇతర వింగ్ ల అధికారులు, వరంగల్  పోలీస్  ఆఫీసర్లతో రివ్యూ చేశారు. అంతకుముందు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన ‘టీజీ-వీర్’ గ్రీవెన్స్  పోర్టల్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నక్సలైట్ల సమస్య తీవ్రంగా ఉండేదని 2010 నుంచి తెలంగాణలో నక్సలిజాన్ని తొలగించేందుకు కృషి చేశామని తెలిపారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు హెల్త్  కార్డులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా పోలీస్  డిపార్ట్​మెంట్ లో సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో నక్సల్స్  ఏరివేతకు పని చేసిన వారిని కొత్తగా ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలకు కేటాయిస్తున్నామన్నారు.

1992–-96 మధ్య మావోయిస్టుల చేతుల్లో చనిపోయిన పోలీస్  కుటుంబాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో డ్రగ్స్  సమస్యగా మారిందని, డ్రగ్  పెడ్లర్లు చిన్న పిల్లలకు కూడా గాంజా కలిపిన చాక్లెట్లు, బిస్కెట్లు అమ్ముతున్నారని చెప్పారు. గతేడాది విద్యాసంస్థల్లో డ్రగ్స్  తీసుకుంటున్న 875 స్టూడెంట్స్ ను గుర్తించినట్లు తెలిపారు. ఇకపై డ్రగ్స్  విషయంలో విద్యాసంస్థలు కూడా బాధ్యతగా వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందన్నారు.

నక్సలైట్లు గంజాయికి వ్యతిరేకం..
నక్సలైట్లు గంజాయికి వ్యతిరేకమని, అందుకే వాళ్లున్న రోజుల్లో గంజాయి సరఫరా చేసేందుకు ఎవరూ ధైర్యం చేయలేదని డీజీపీ చెప్పారు. వరంగల్  రూరల్  ఏఎస్పీగా పని చేస్తన్న సమయంలో కూంబింగ్  కోసం వెళ్లినప్పుడు గంజాయి కనపడేదన్నారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడిన దాంట్లో తానే ముందున్నానని, గంజాయి విషయంలో తాను చెప్పిన విషయాన్ని వక్రీకరించి మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడినట్లు చూపించారని చెప్పారు.

సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకే చాలామందికి సెక్యూరిటీ తగ్గించినట్లు తెలిపారు. నక్సల్స్  సమస్య లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎవరికీ పూర్తిగా సెక్యూరిటీ తొలగించలేదని, అకారణంగా ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వరంగల్  సీపీ ఎన్.శ్వేత, సీసీటీఎన్ఎస్, సైబర్  సెక్యూరిటీ బ్యూరో, ఈగల్  ఫోర్స్  ఎస్పీలు చెన్నూరి రూపేశ్, సాయి శ్రీ, గిరిధర్  పాల్గొన్నారు.

గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం
జయశంకర్ భూపాలపల్లి: గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆదివారం భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసులతో భూపాలపల్లిలో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేస్తామన్నారు.

కల్తీ ఆహార పదార్థాలపై నిఘా పెంచడంతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో తనిఖీలు, దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో పోలీసు శాఖకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా, భూపాలపల్లి, ములుగు ఎస్పీలు సిరిశెట్టి సంకీర్త్, సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు.