
- ముంబై, రాచకొండ పోలీసుల నుంచి రికార్డుల సేకరణ
- డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరించిన మహారాష్ట్ర పాత నేరస్తులు
- డ్రగ్స్ డీలర్లు ఫజల్, ముస్తాఫాల సీసీ టీవీ ఫుటేజ్ స్వాధీనం
- వాగ్దేవి ల్యాబొరేటరీస్‌లో పీసీబీ, ఎక్సైజ్ అధికారుల సోదాలు
- డ్రగ్స్, ముడి సరుకు శాంపిల్స్ సేకరణ
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో బయటపడ్డ డ్రగ్స్ డెన్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఫోకస్ పెట్టింది. ఓ వైపు మహారాష్ట్ర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగా, ఎన్‌సీబీ అధికారులు ముంబై క్రైమ్ బ్రాంచ్ సెల్, థానే ఎంబీవీవీ పోలీసులు సహా రాచకొండ పోలీసుల నుంచి కేసు రికార్డులను సేకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసులు సీజ్ చేసిన మెఫెడ్రోన్, లిక్విడ్ కెమికల్స్ సహా అన్ని ఆధారాలను ఎన్‌సీబీ అధికారులు కలెక్ట్ చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎక్సైజ్ అధికారులు చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్‌లో సోమవారం సోదాలు నిర్వహించారు. కంపెనీలో తయారు చేస్తున్న కెమికల్స్, వ్యర్థాలు, సింథటిక్ డ్రగ్స్ సంబంధించిన శాంపిల్స్ సేకరించారు.
ఫజల్, ముస్తఫాఖాన్ నుంచి రిటైల్ సప్లయర్లకు..
ఫజల్, ముస్తఫాఖాన్ హైదరాబాద్ నుంచి తీసుకెళ్లిన మెఫెడ్రోన్‌ను ముంబై, థానే సహా పరిసర పట్టణాల్లోని డ్రగ్స్ పెడ్లర్లకు గ్రాముల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. కొన్ని సమయాల్లో శ్రీనివాస్ విజయ్ కూడా ముంబైకి వెళ్లి డ్రగ్స్ అందించేవాడని గుర్తించారు. ఈ క్రమంలోనే థానే జిల్లాలో బంగ్లాదేశ్ యువతి పట్టుబడిన తర్వాత ఫజల్, ముస్తఫాఖాన్ సహా ఈ ముఠాలో 11 మందిని అరెస్ట్ చేశారు. ఫజల్, ముస్తఫాఖాన్‌ను వెంటబెట్టుకుని గురువారం హైదరాబాద్ వచ్చారు.
చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్‌పై శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్నట్టుగా దర్యాప్తు ఏజెన్సీలు భావిస్తున్నాయి. విదేశీ ఏజెంట్లు సైతం శ్రీనివాస్ విజయ్‌తో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు మనీలాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు చేసేందుకు ఈడీ అధికారులు సైతం రంగంలోకి దిగే చాన్స్ ఉంది.
డ్రగ్స్ డీలర్లుగా ముంబై పాత నేరస్తులు
ఈ కేసులో వాగ్దేవి కంపెనీ నిర్వాహకులు శ్రీనివాస్ విజయ్ వోలేటి, అతని అనుచరుడు తానాజీ పండరినాథ్ పట్వారీను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో వీరిద్దరు సహా మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. చర్లపల్లి కేంద్రంగా తయారు చేస్తున్న మెఫెడ్రోన్ దందాలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్‌లో తయారు చేస్తున్న మెఫెడ్రోన్ డ్రగ్‌ను మహారాష్ట్రకు చెందిన పాత నేరస్తులు ఫజల్, ముస్తఫాఖాన్ కొనుగోలు చేసేవారు.
వీరిద్దరిపై ముంబై, థానేలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. వీరికి శ్రీనివాస్ విజయ్ డైరెక్ట్‌గా డ్రగ్స్ డెలివరీ ఇచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో ఫజల్, ముస్తఫా హైదరాబాద్‌కు వచ్చి డ్రగ్ పార్సిల్స్ తీసుకెళ్లే వారని పోలీసులు దర్యాప్తులో తేలింది. వీళ్లు హైదరాబాద్‌కు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్‌లను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.