కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై శరద్ పవార్ కీలక నిర్ణయం

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై శరద్ పవార్ కీలక నిర్ణయం

శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) మేలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 40- నుంచి 45 స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.  కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో తమ అభ్యర్థులను బరిలో దించాలనుకుంటోంది. దీనిపై ఏప్రిల్ 15న ముంబైలో పార్టీ నేతలు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. 

ఇటీవల ఎన్‌సీపీ జాతీయ హోదా కోల్పోయిన క్రమంలో జాతీయ పార్టీ హోదాను తిరిగి పొందే వ్యూహంలో భాగంగా ఎన్‌సీపీ  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.  కర్ణాటకలో అధికార బీజేపీకి కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీని అధికారం నుంచి తప్పించాలని, జేడీ(ఎస్)ని కింగ్ మేకర్‌గా ఎదగకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

కర్ణాటకలో  మే 10న  ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడించనున్నారు.  224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.