- అధికార కూటమికే జనం మళ్లీ పట్టం కట్టారంటున్న ఎగ్జిట్ పోల్స్
- ఎన్డీయే ఈజీగానే మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లను దాటే చాన్స్
- ప్రతిపక్ష మహాఘట్ బంధన్‌కు మరోసారి నిరాశే
- 100 సీట్లకు అటూఇటూగానే రావచ్చని అంచనా
- జన్‌సురాజ్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశం
- పీకే ఎఫెక్ట్‌తో మహాఘట్ బంధన్ ఓట్లకే గండిపడి ఉండొచ్చని వెల్లడి
పాట్నా/న్యూఢిల్లీ:బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే) కూటమికే ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. మ్యాజిక్ ఫిగర్ ను దాటి భారీ మెజార్టీతో ఎన్డీయే ఘన విజయం సాధించనుందని తెలిపాయి. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమికి మళ్లీ నిరాశ తప్పదని అంచనా వేశాయి.
ఇక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ(జేఎస్పీ) ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. మంగళవారం సాయంత్రం బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండో (ఆఖరి) విడత పోలింగ్ ముగియగానే ఆయా సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ(మ్యాజిక్ ఫిగర్) 122 సీట్లు అవసరం.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ ను ఈజీగా దాటి 130 కంటే ఎక్కువ సీట్లనే గెలుచుకోవచ్చని 7 ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఓవరాల్ గా కనీస మెజార్టీ కంటే 8 నుంచి 45 సీట్లు ఎక్కువే సొంతం చేసుకోవచ్చని సర్వే సంస్థలు అంచనా వేశాయి. మహాఘట్ బంధన్ కూటమి 73 నుంచి 108 సీట్లకే పరిమితం కావచ్చని, మ్యాజిక్ ఫిగర్ కు 14 నుంచి 49 సీట్ల దూరంలోనే ఉండిపోవచ్చని పేర్కొన్నాయి. ఇక జేఎస్పీ 0 నుంచి 4 సీట్లకు మించి గెలుచుకోకపోవచ్చని స్పష్టం చేశాయి.
అయితే, ఎన్నికల్లో జేఎస్పీ ప్రభావం స్వల్పమే అయినప్పటికీ, ఆ స్వల్ప ఓటింగ్ శాతమే మహాఘట్ బంధన్ ను గట్టిగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎన్డీయే అభ్యర్థులు గెలిచే చోట్ల జేఎస్పీకి ఓట్లు పడలేదని, ఆ పార్టీకి ఓట్లు పడిన చోట్లలో మహాఘట్ బంధన్ అభ్యర్థులే ఓటమిపాలయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఓటర్ల సెంటిమెంట్ ను ప్రతిబింబించేలా ఉంటాయని భావిస్తున్నా.. తరచూ అవి తలకిందులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఈ నెల 14న ఓట్ల లెక్కింపు తర్వాతే ఏ కూటమి భవితవ్యం ఏమిటనేది స్పష్టం కానుందని చెప్తున్నారు.
ఎన్డీయేకు 46% ఓట్లు.. బీజేపీకి 70 దాకా సీట్లు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లలో ఎన్డీయే కూటమికి దాదాపు 46.2% ఓట్లు రావచ్చని పీపుల్స్ పల్స్ సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేసింది. ఎంజీబీకి 37.9%, జేఎస్పీకి 9.7%, ఇతరులకు 6.2% ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక పార్టీలవారీగా సీట్ల విషయానికి వస్తే అత్యధికంగా ఎన్డీయేలోని బీజేపీకి 63 – 70 సీట్లు, మహాఘట్ బంధన్‌లోని ఆర్జేడీకి 62 నుంచి69 సీట్లు రావచ్చని తెలిపింది.
అలాగే జేడీయూకు 55-62, ఎల్జేపీ(ఆర్వీ)కి 12-–17, కాంగ్రెస్‌కు 9-–18, సీపీఐ(ఎంఎల్)కు 4-9, హెచ్ఏంకు 2-5, ఆర్ఎల్ఎంకు 1-4, జేఎస్పీకి 0-5, వీఐపీకి 0-5, ఎంఐఎంకు 0-2, ఇతరులకు 2-8 సీట్లు వస్తాయని అంచనా వేసింది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కే అత్యధికంగా 32% మంది మొగ్గుచూపారని, ప్రస్తుత సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ కు 30% మంది మద్దతు తెలిపారని పీపుల్స్ పల్స్ తన ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది. వీరిద్దరి తర్వాత ప్రశాంత్ కిశోర్, చిరాగ్ పాశ్వాన్ లకు చెరో 8% మంది మద్దతు ఉన్నట్టు పేర్కొంది.
