ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టుకు ఎన్డీఎస్ఏ టీమ్​

ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టుకు ఎన్డీఎస్ఏ టీమ్​
  •     3 రోజులు పలు అంశాల పరిశీలన
  •     13 నుంచి నాగార్జునసాగర్​లో మరో టీమ్​ పర్యటన

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టును మంగళవారం నుంచి గురువారం వరకు నేషనల్​ డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) టీమ్​ సందర్శించనుంది. ఎన్డీఎస్ఏ మెంబర్​ వివేక్ ​త్రిపాఠి నేతృత్వంలోని టీమ్​లో ఎన్డీఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్​ అమిత్ ​మిట్టల్, కన్సల్టెంట్​కమలేశ్​జైన్​తోపాటు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, సీఎస్ఎంఆర్ఎస్, ఏపీ, తెలంగాణ నుంచి నామినేట్​అయిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. మూడు రోజుల పాటు ఈ బృందం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి లోపాలపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనుంది. 2009లో శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన భారీ వరదలతో స్పిల్​వే దిగువన ప్లంజ్​పూల్​(భారీ గుంత) ఏర్పడింది. 

ఆ తర్వాత వచ్చిన వరదలతో దాని తీవ్రత పెరిగింది. కేఆర్ఎంబీ మెంబర్​రవికుమార్​పిళ్లై నేతృత్వంలోని ఎక్స్​పర్ట్​టీమ్​గతంలోనే శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి ప్లంజ్​పూల్​ను పూడ్చేయడంతోపాటు ఇతర రిపేర్లు చేపట్టాలని నివేదించింది. ఇందుకు రూ.800 కోట్ల వరకు ఖర్చవుతాయని తెలిపింది. ప్లంజ్​పూల్​ను పూడ్చేయకపోతే డ్యామ్​ భద్రతకే ప్రమాదమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ టీమ్​డ్యామ్​ను పరిశీలించి ప్లంజ్​పూల్​తోపాటు శ్రీశైలం భద్రతకు సంబంధించిన అన్ని అంశాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఎన్డీఎస్ఏ మెంబర్ ​రాకేశ్ ​కష్యప్ నేతృత్వంలోని మరో టీమ్​ఈనెల 13 నుంచి 15 వరకు నాగార్జున సాగర్​ప్రాజెక్టును పరిశీలించనుంది. ఈ టీమ్​లో ఎన్డీఎస్ఏ డైరెక్టర్​ ఎం.ఎస్. వర్మ, డిప్యూటీ డైరెక్టర్​మహ్మద్​జిషాన్, కన్సల్టెంట్​ రాకేశ్ గౌరానాతోపాటు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, ఏపీ, తెలంగాణ నుంచి నామినేట్​ అయిన అధికారులు సభ్యులుగా ఉంటారు. సాగర్​స్పిల్​వే దెబ్బతినడంతో రూ.20 కోట్లతో తెలంగాణ  రిపేర్లు చేయిస్తోంది. ఎన్డీఎస్ఏ టీమ్​ఆ పనులతో పాటు రిజర్వాయర్​కు సంబంధించిన అన్ని భద్రత అంశాలను పరిశీలించి కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనుంది.