600 మంది ఖైదీలు విడుదల

600 మంది ఖైదీలు విడుదల
  • గాంధీ జయంతి సందర్భంగా విడుదలకు ఏర్పాట్లు
  • ఇప్పటికే రెండు విడతల్లో
  • 1,424 మందికి అవకాశం

న్యూ ఢిల్లీ: అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు. ఇందులో అర్హులైన 600 మంది  ఖైదీలకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఫైనల్ రిపోర్టును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్స్ కలిసి రూపొందిస్తున్నాయని వెల్లడించారు. స్పెషల్ పర్మిషన్ స్కీమ్ కింద ఇప్పటికే  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు విడతల్లో 1,424 మంది ఖైదీలను విడుదల చేశాయి.  మూడో దశలో అక్టోబర్ 2న ఖైదీల విడుదలకు చర్యలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు చెప్పాయి. పడిన శిక్షలో సగం కాలం పూర్తయిన 55 ఏళ్లు నిండిన మహిళా ఖైదీలు, 60 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న పురుష ఖైదీలు, లింగమార్పిడి దోషులు, 70 శాతం ఆపైన అంగవైకల్యం ఉన్నవారు ఈ స్కీమ్ కింద విడుదల కానున్నట్లు వెల్లడించాయి. హత్య, అత్యాచారం, అవినీతి కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులు సహా ఇతర ఖైదీలకు ఈ అవకాశం ఉండదు. జీవిత ఖైదు, మరణ శిక్ష పడే వీలున్న  నేరాలకు పాల్పడి వారికీ అవకాశం ఉండదు.