NED vs SL: నెద‌ర్లాండ్స్‌పై విజయం.. బోణీకొట్టిన లంకేయులు

NED vs SL: నెద‌ర్లాండ్స్‌పై విజయం.. బోణీకొట్టిన లంకేయులు

శ్రీలంక అభిమానులను సంతోష పెట్టే వార్త ఇది. ఎట్టకేలకు వారి జట్టు ఒక విజయం సాధించింది. వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా శనివారం నెద‌ర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు. మొదట నెదర్లాండ్స్ 262 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో లంక మరో పది బంతులు మిగిలివుండగానే మ్యాచ్‌ను ముగించింది.

రాణించిన డచ్ లోయర్ ఆర్డర్

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన‌ నెద‌ర్లాండ్స్ 262 పరుగులు చేసింది. ఆరంభంలో లంక బౌల‌ర్లు నెద‌ర్లాండ్స్‌ను క‌ట్ట‌డి చేసినా.. లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు పోరాడారు. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్‌ను.. ఎంగిల్‌బ్రెచ్‌(70), లోగ‌న్‌ వాన్ బీక్(59) ఆదుకున్నారు. ఫలితంగా నెదర్లాండ్స్.. లంకేయుల ముందు మంచి టార్గెట్ నిర్ధేశించగలిగింది. లంక బౌలర్లలో ర‌జ‌త‌, మ‌ధుశంక‌లు చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు.

సమరవిక్రమ వన్ మ్యాన్ షో

అనంతరం 263 పరుగుల లక్ష్యాన్ని లంక మరో పది బంతులు మిగిలివుండగానే మ్యాచ్‌ను ముగించింది. సమరవిక్రమ(91), పథుమ్ నిస్సంక(54) హాఫ్ సెంచరీలు చేయగా.. చరితఅసలంక(44), ధనంజయడిసిల్వా(30) పర్వాలేదనిపించారు. నెద‌ర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ 4 వికెట్లు తీసుకోగా.. వాన్ మీకరెన్, ఆకర్ మెన్ చెరో వికెట్  పడగొట్టారు.