
నెక్లస్ రోడ్లో నీరా(కల్లు) కేఫ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం (మే3) న ప్రారంభించి.. ఫుడ్ కోర్టు ప్రాంగణాన్ని తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరా అంటే ఆల్కహాల్ అని దుష్ప్రచారం ఉందని.. కాని ఇది వేదామృతం అంటూ దేవతలు తాగే అమృతమున్నారు. ప్రకృతి సిద్దంగా లభిస్తున్న స్వచ్చమైన అమృతమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ తరహా నీరా కేఫ్ లేదు. గీత కార్మికుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నీరాకేఫ్ నిలుస్తుందని మంత్రి అన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన స్వామీజీలతో సహా పలువురు మంత్రులు నీరాను సేవించారు.
గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా నీరా కేఫ్
భాగ్యనగర వాసుల కోసం గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా నీరా కేఫ్ అందుబాటులోకి వచ్చింది. సిటీలో ఉండే ప్రజలకు నీరాను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం నీరా కేఫ్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ లో 300 నుంచి 500 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఈ నీరా కేఫ్ నుండి టేక్ అవే సౌకర్యాన్ని కూడా కల్పించారు. కేఫ్ లో ఏడు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్
ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన నీరాను అందించడం కోసం ప్రభుత్వం 12.20 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ ను సుందరంగా నిర్మించారు. హైదరాబాద్ నగర వాసులతోపాటు, పర్యాటకుల కోసం ఈ నీరా కేఫ్ను సుందరంగా తీర్చి దిద్దినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 319 మంది గీత కార్మికులను గుర్తించి శిక్షణ కూడా ఇప్పించింది.
బోటింగ్ ఏర్పాటు
తాటిచెట్లు, మట్టికుండలు, కల్లుగీత దృశ్యాలు, తాటాకు ఆకారం వచ్చేలా కేఫ్పై కప్పు తయారు చేశారు. అంతేకాదు కేఫ్ దగ్గర బోటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు. నెక్లెస్ రోడ్ లో ఉన్న నీరా కేఫ్ నుంచి బుద్ధుడి విగ్రహం వరకు బోటింగ్ ఏర్పాట్లను సైతం చేస్తున్నారు. నీరా కేఫ్ లను ఏర్పాటు చేయడంవల్ల గ్రామీణ ప్రాంతాలలో దొరికే నీరా నగర వాసులకు కూడా ఈజీగా దొరుకుతుంది.
తద్వారా గీత కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే గీత కార్మికుల వృత్తిని చాలామంది వద్దని భావిస్తూ ఇతర వృత్తుల వైపు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో, గీత కార్మికులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని గౌడ సంఘం నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా నీరా కేఫ్ నగర వాసులకు ఒక గొప్ప అనుభూతిని అందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది