నీట్ రిజల్ట్స్ ..రిలీజ్ తెలంగాణ నుంచి 42,654 మంది క్వాలిఫై

నీట్ రిజల్ట్స్ ..రిలీజ్ తెలంగాణ నుంచి 42,654 మంది క్వాలిఫై
  • దేశవ్యాప్తంగా 11,45,976 మంది ఉత్తీర్ణత
  • తమిళనాడు స్టూడెంట్​ ప్రభంజన్, ఏపీ విద్యార్థి వరుణ్ చక్రవర్తికి ఫస్ట్ ర్యాంకు
  • తెలంగాణకు చెందిన రఘురాం రెడ్డికి 15వ ర్యాంకు

హైదరాబాద్/సత్తుపల్లి, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్‌‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలను మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. 20,38,596 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. 11,45,976 మంది అర్హత సాధించినట్లు ప్రకటించింది. తమిళనాడుకు చెందిన ప్రభంజన్, ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తి ఉమ్మడిగా ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు ఎన్‌‌టీఏ తెలిపింది. ఈ ఇద్దరు 720కి 720 మార్కులు సాధించినట్లు చెప్పింది. తెలంగాణకు చెందిన రఘురాం రెడ్డి (715 మార్కులు)కి15వ ర్యాంకు, జాగృతి బోడెద్దుల(710) కు 49వ ర్యాంకు, గండికోట లక్ష్మీ రష్మిత(710)కు 52వ ర్యాంకు, జి.ప్రాచి (710)కి 65వ ర్యాంకు వచ్చాయి. విద్యార్థులు వెబ్‌‌సైట్‌‌(neet.nta.nic. in)లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న 540కి పైగా మెడికల్ కాలేజీల్లో 80 వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు చెప్పింది.

అత్యధికంగా యూపీ స్టూడెంట్లు క్వాలిఫై

ఈ ఏడాది వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మన దేశంతో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4,097 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన స్టూడెంట్లు క్వాలిఫై అయ్యారు. 1.39 లక్షల మంది యూపీ నుంచి ఉత్తీర్ణత సాధించగా.. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (1.31 లక్షల మంది), రాజస్థాన్ (లక్ష మందికి పైగా) రాష్ట్రాలున్నాయి. ఇక కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో 75 వేల మందికిపైగా క్వాలిఫై అయ్యారు. మన రాష్ట్రం నుంచి ఈ ఏడాది 73,883 మంది విద్యార్థులు నీట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా,72,842 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 42,654 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 58.50  శాతం మంది క్వాలిఫై అయ్యారు. గతేడాది 50,392 మంది నీట్ రాయగా.. 28,093 మంది (55.74 శాతం)  క్వాలిఫై అయ్యారు. గతేడాది కంటే మూడు శాతం అధికంగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే గతేడాది టాప్ టెన్‌‌లో మన రాష్ట్రం నుంచి ముగ్గురు ఉండగా, ఈ ఏడాది ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.