- నవంబర్ 20 నుంచి అకడమిక్ సెషన్ ప్రారంభం
- నాలుగు విడతల్లో సీట్ల భర్తీ..వివరాలు వెల్లడించిన ఎంసీసీ
హైదరాబాద్, వెలుగు: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ తాత్కాలిక షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ), 100 శాతం డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ఏఎఫ్‌ఎంఎస్ సీట్ల భర్తీ కోసం మొత్తం నాలుగు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది.
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి అక్టోబర్ 10 నుంచి 12 వరకు సీట్ల మ్యాట్రిక్స్ పరిశీలన పూర్తవుతుంది. అనంతరం ఈనెల12 నుంచి 21 మధ్యాహ్నం 12 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు, మధ్యాహ్నం 3 గంటల వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 13 నుంచి 22 ఉదయం10 గంటల వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు.
చాయిస్ లాకింగ్ ప్రక్రియ అక్టోబర్ 21 సాయంత్రం 4 గంటల నుంచి మొదలవుతుంది. అక్టోబర్ 22, 23 తేదీల్లో సీట్ల కేటాయింపును పరిశీలించి, 24న ఫలితాలు ప్రకటిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2వ తేదీలోగా ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
నవంబర్ 20 నుంచి క్లాసులు ప్రారంభం
సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు నవంబర్ 6 నుంచి11 వరకు జరగనుండగా, నవంబర్ 7 నుంచి 12 వరకు చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. నవంబర్ 14న సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడించి, 16 నుంచి 23 వరకు రిపోర్టింగ్‌కు గడువు ఇచ్చారు. అనంతరం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు నవంబర్ 26 నుంచి డిసెంబర్1 వరకు, వెబ్ ఆప్షన్ల నమోదు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 4న థర్డ్ ఫేజ్ ఫలితాలు ప్రకటించనుండగా, సీట్లు దక్కించుకున్న విద్యార్థులు డిసెంబర్ 5 నుంచి 12 వరకు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.
చివరిగా మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ నిర్వహిస్తారు. ఇందుకోసం డిసెంబర్ 16 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్లు, చాయిస్ ఫిల్లింగ్ చేపట్టనుండగా, డిసెంబర్ 24న ఫలితాలు విడుదలవుతాయి. సీట్లు పొందిన వారు డిసెంబర్ 24 నుంచి 31 లోగా చేరాల్సి ఉంటుంది. కాగా, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ తరగతులు నవంబర్ 20 నుంచే ప్రారంభమవుతాయని ఎంసీసీ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ గడువు తక్కువగా ఉన్నందున పాల్గొనే అన్ని కాలేజీలు, సంస్థలు శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లోనూ యథావిధిగా పనిచేయాలని ఆదేశించింది.
