‘అమ్మా నాన్నా ఐ లవ్ యూ.. ఐ యామ్ సారీ’.. డెహ్రాడూన్‌లో నీట్ విద్యార్థిని ఆత్మహత్య

‘అమ్మా నాన్నా ఐ లవ్ యూ.. ఐ యామ్ సారీ’.. డెహ్రాడూన్‌లో నీట్ విద్యార్థిని ఆత్మహత్య

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్(NEET) దేశంలో ఎందరో విద్యార్థుల జీవితాల్లో ఎంతటి తీవ్ర ఒత్తిడిని నింపుతుందో చెప్పడానికి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో జరిగిన ఒక విషాద ఘటనే నిదర్శనం. చంద్రబని ప్రాంతానికి చెందిన రియా(23) అనే నీట్ విద్యార్థిని మంగళవారం ఉదయం తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవటం తీవ్ర కలకలం రేపింది. నీట్ రీ-ఎగ్జామినేషన్ పై నెలకొన్న గందరగోళం, ఆందోళనల కారణంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రియా చదువులో ఎంతో చురుకైన అమ్మాయి. ఇంటర్‌లో ఏకంగా 96.7 శాతం మార్కులతో కాలేజ్ టాపర్‌గా నిలిచింది. అంతటి బ్రైట్ స్టూడెంట్.. కెరీర్‌లో సక్సెస్ సాధించలేకపోతున్నాననే ఫ్రస్ట్రేషన్, నిరాశతో ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో "అమ్మా, నాన్నా.. ఐ లవ్ యూ.. ఐ యామ్ సారీ" అని రాస్తూ, తన చదువులో అనుకున్న విజయం సాధించలేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఘటన జరిగిన రోజు ఉదయం అంతా నార్మల్‌గానే సాగింది. ఉదయం 10:30 గంటల సమయంలో తల్లి టిఫిన్ చేయడానికి రియాను పిలిచింది. ఎంతకూ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తండ్రిని పిలిపించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి రియా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అంతకుముందు రోజు రాత్రి కూడా రియా తన తల్లిదండ్రులతో కలిసి ఒక ధార్మిక కార్యక్రమానికి వెళ్లి వచ్చిందని, ఆమె ప్రవర్తనలో ఎలాంటి తేడా గానీ.. డిప్రెషన్ లక్షణాలు గానీ తాము గమనించలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ALSO READ : చంపేసి ఉంటే.. పిడికెడు మట్టి అయినా ఇవ్వండయ్యా

సాధారణంగా రియా రాత్రిళ్లు ఆలస్యంగా చదువుకునేదని, అందుకే ఉదయం కూడా లేట్ గా లేచే అలవాటు ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఒంటరిగా గడపడం, ఎవరితోనూ మాట్లాడకపోవడం వంటి మార్పులేవీ ఆమెలో కనిపించలేదని సర్కిల్ ఆఫీసర్ అంకిత్ కందారి వెల్లడించారు. పొరుగువారితో మాట్లాడినా ఎలాంటి క్లూ దొరకలేదన్నారు. చదువులో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. పరీక్షల చుట్టూ ఉన్న అనిశ్చితి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.