నీట్ రద్దు చేయాలి .. లీకేజీకి మోదీదే బాధ్యత : రాహుల్ గాంధీ

 నీట్ రద్దు చేయాలి ..  లీకేజీకి మోదీదే బాధ్యత  :   రాహుల్ గాంధీ

ఢిల్లీ: నీట్ పరీక్షను రద్దు చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారైందన్నారు. ఎగ్జామ్స్ నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్నాయని, చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించినట్టుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయాలని చూస్తున్నారని, వ్యవస్థలను కబ్జా చేయడం జాతి విద్రోహ చర్యేనని రాహుల్ అన్నారు. మోదీ సర్కారు చర్యల వల్ల దేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ లేకుండా పోయిందని అన్నారు. ఒక్కో పరీక్షకు ఒక్కో  నిబంధన అనేది సమంజసం కాదని చెప్పారు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని ప్రధాని మోదీ లీకేజీకి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.