- మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్
- నిమిషం లేటయినా నో ఎంట్రీ
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2026కు సర్వం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మన రాష్ట్రం నుంచి 73 వేలకు పైనే మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ కు అప్లై చేశారు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 199 సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. 1:30 గంటలకే గేట్లు మూసివేస్తామని, ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా, దేశవ్యాప్తంగా 566 నగరాల్లో ఈ మెగా ఎగ్జామ్ జరగనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. ఇక విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు ఈసారి రాష్ట్రంలోని 24 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి మెయిన్ సిటీలతో పాటు కొత్తగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, జనగాం, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, జగిత్యాల వంటి జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు పెట్టారు. ఎగ్జామ్ లను పటిష్ట భద్రత, బందోబస్తు మధ్య నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ నోడల్ ఆఫీసర్ గా, అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం.భగవత్ పోలీస్ ప్రతినిధిగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సెంటర్ల వద్ద డ్యూయల్ లేయర్ ఫ్రిస్కింగ్, సీసీ కెమెరాలు, జామర్లు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ తో నిఘా ఏర్పాటు చేశారు.
నీట్ ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తప్పుగా..
నీట్ అడ్మిట్ కార్డులో ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తప్పుగా పడడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఓవిద్యార్థినికి రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో సెంటర్ పడింది. అయితే, ఈ సెంటర్ కోడ్ 4208101 కలిగిన విద్యార్థుల అడ్మిట్ కార్డుల్లో లొకేషన్ పేరు రాజేంద్రనగర్ కు బదులుగా హయత్ నగర్ అని ప్రింట్ అయ్యింది.
హయత్ నగర్, రాజేంద్రనగర్ సిటీకి అటువైపు, ఇటువైపు ఉండటంతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. కొందరు విద్యార్థులు శనివారమే సెంటర్ కోడ్ ఆధారంగా రాజేంద్రనగర్ చేరుకునిఅది శివరాంపల్లిలోని స్కూలేనని కన్ఫర్మ్ చేసుకున్నారు.
అడ్మిట్ కార్డులో హయత్ నగర్ అని ఉన్నప్పటికీ.. సెంటర్ కోడ్ 4208101 అని ఉంటే అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావొద్దని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మల్లోజు సత్యనారాయణచారి సూచించారు. ఆ కోడ్ కలిగిన సెంటర్ కచ్చితంగా రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లిలోని ప్రజాభవన్ ఎన్పీఏ ఎదురుగా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మాత్రమేనని స్పష్టం చేశారు. పొరపాటున హయత్ నగర్ వైపు వెళ్లి సమయం వృధా చేసుకోవద్దని, మ్యాప్స్, లోకల్ అడ్రస్ ద్వారా శివరాంపల్లి సెంటర్ కు చేరుకోవాలని కోరారు.
