నీట్ పరీక్ష పేపర్ ఎక్కడ లీక్ అయ్యింది.. కుట్ర దారులు ఎవరు.. పాత్రదారులు ఎవరు.. ఎంతకు అమ్మారు..!

నీట్ పరీక్ష పేపర్ ఎక్కడ లీక్ అయ్యింది.. కుట్ర దారులు ఎవరు.. పాత్రదారులు ఎవరు.. ఎంతకు అమ్మారు..!

నీట్ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సుమారు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయనే వార్తలు అటు విద్యార్థులను.. ఇటు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఈ కేసును లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయగా విస్తుపోయే నిజాలను వెలుగులోకి వస్తున్నాయి.

కుట్రకు చేసింది ఎవరు..?
పేపర్ లీక్ కుట్ర వెనుక ఒక పక్కా ప్లాన్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రాజస్థాన్ పోలీసులు జైపూర్‌కు చెందిన మనీష్‌ అనే వ్యక్తిని కీలక సూత్రధారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో ‘ప్రైవేట్ మాఫియా’ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ అధికారులను షాక్ కి గురిచేసింది. ఈ గ్రూప్‌లో ఏకంగా 400 మందికి పైగా సభ్యులు ఉన్నారు. లీక్ అయిన ప్రశ్న పత్రాలను షేర్ చేయడం కోసమే ఈ గ్రూప్ క్రియేట్ చేసారు. గ్రూప్ లోని క్వశ్చన్ పేపర్, అందులోని వివరాలను బయట వ్యక్తులకు షేర్ చేయకూడదని గ్రూప్ అడ్మిన్స్ హెచ్చరించినట్లు అధికారుల దర్యాప్తులో తెలిసింది.

లీక్ ఎక్కడ మొదలైంది?
రాజస్థాన్‌లోని సీకర్ జిల్లా ఈ లీక్ వ్యవహారానికి సెంటర్ పాయింట్ అని ఇప్పటి వరకూ జరిపిన ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం తేలింది. సీకర్‌లోని పిప్రాలీ రోడ్డులో 'SK కన్సల్టెన్సీ' నడుపుతున్న రాకేష్ మాండవారియా అనే వ్యక్తి ఈ పేపర్ అందరికీ పంచటంలో కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. పరీక్షకు 15 రోజుల ముందే.. అంటే ఏప్రిల్ నెలలోనే ఈ Question Bank నిందితుల చేతికి చిక్కినట్లు సమాచారం. సీకర్ నుంచి ఈ పేపర్ చురు, జుంజును, డెహ్రాడూన్ వంటి ప్రాంతాలకు కూడా పాకింది. కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న ఒక విద్యార్థికి కూడా దీని పీడీఎఫ్ వెళ్లినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు.

60 ప్రశ్నలు అక్షరం పొల్లు పోకుండా..
SOG దర్యాప్తులో బయటపడ్డ అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. నిందితుల వద్ద దొరికిన 410 ప్రశ్నల గెస్ పేపర్‌లో దాదాపు 60 ప్రశ్నలు అసలు నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో అక్షరం పొల్లు పోకుండా ఉండటమే. ముఖ్యంగా కెమిస్ట్రీ 120 ప్రశ్నలలో ఎక్కువ శాతం ప్రశ్నలు నిందితులు ముందుగానే విద్యార్థులకు షేర్ చేసిన గెస్ పేపర్‌లో ఉన్నాయని అదనపు డైరెక్టర్ జనరల్ విశాల్ బన్సల్ తెలిపారు. ఈ ప్రశ్న పత్రాలను ఆన్‌లైన్ ద్వారానే కాకుండా, ప్రింటెడ్ కాపీల రూపంలో కూడా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి నిందితులు అమ్ముకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏడాది పొడవునా కష్టపడి చదివిన సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పరిణామాలతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఒకవైపు కష్టపడి చదివిన వారికి అన్యాయం జరుగుతుందన్న భయం.. మరోవైపు పరీక్ష మళ్లీ నిర్వహిస్తారేమో అన్న సందిగ్ధంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. లక్షల రూపాయలు కట్టి పేపర్లు కొన్న వారి వల్ల ప్రతిభావంతులైన పేద విద్యార్థుల సీట్లు దక్కవనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే తాము పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చెబుతోంది. జీపీఎస్ వాహనాలు, ఏఐ సీసీటీవీలు, 5జీ జామర్లు వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించామని పేర్కొంది. ఒకవేళ తప్పు జరిగినట్లు తేలితే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఈ నెట్‌వర్క్ ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉందో తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.