నీట్ యూజీ  పరీక్షలపై ఆందోళన వద్దు..రాజస్థాన్ ‘పేపర్ లీక్’ ఆరోపణలపై ఎన్టీఏ క్లారిటీ

నీట్ యూజీ  పరీక్షలపై ఆందోళన వద్దు..రాజస్థాన్ ‘పేపర్ లీక్’ ఆరోపణలపై ఎన్టీఏ క్లారిటీ
  • మే 3న పరీక్ష, 7న రాత్రి
  • అక్రమాలపై సమాచారం వచ్చింది
  • ఎస్ఓజీ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు వెల్లడి
  • విద్యార్థులు ఆందోళన చెందొద్దని భరోసా

హైదరాబాద్, వెలుగు: నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న వార్తలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటన విడుదల చేసింది.  రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) చేపట్టిన చర్యల నేపథ్యంలో ఎన్టీఏ వివరణ ఇస్తూ.. అక్రమాలకు పాల్పడిన వారిపై దర్యాప్తు సంస్థలు తీసుకుంటున్న చర్యలను స్వాగతించింది. మే 3న నీట్ పరీక్షను అత్యంత భద్రత మధ్య నిర్వహించామని ఎన్టీఏ వెల్లడించింది.

ప్రశ్నపత్రాల తరలింపులో జీపీఎస్ ట్రాకింగ్, సెంటర్లలో ఏఐ సీసీటీవీలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్, 5జీ జామర్లను వినియోగించినట్లు తెలిపింది. పరీక్ష ముగిసిన నాలుగు రోజుల తర్వాత (మే 7న) మాల్ ప్రాక్టీస్ గురించి తమకు సమాచారం అందిందని, వెంటనే మే 8న కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ చేస్తున్న అరెస్టులు, విచారణ తమ ఫిర్యాదు ఫలితమేనని ఎన్టీఏ తెలిపింది. ‘‘ దర్యాప్తు ఏజెన్సీలకు అవసరమైన పూర్తి సాంకేతిక సమాచారాన్ని అందిస్తున్నాం. విచారణ పూర్తి కాకముందే ఊహాగానాలు చేయవద్దు. ఏజెన్సీల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు పారదర్శకంగా ఉంటాయి” అని ఏజెన్సీ పేర్కొంది.

విద్యార్థులు ఆందోళన చెందొద్దు.. 

లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని, వారి నిజాయితీని తాము తక్కువ చేయబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది. అభ్యర్థులు, వారి కుటుంబాలు ఆందోళన చెందవద్దని.. దర్యాప్తు సంస్థలకు సహకరించాలని కోరింది. విద్యాశాఖతో సంప్రదింపులు జరిపి అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది. విద్యార్థులకు ఏవైనా సందేహాలుంటే నీట్ 2026 హెల్ప్‌‌లైన్ neet-ug@nta.ac.in లేదా ఫోన్ నంబర్లు 011-–40759000 / 011-–69227700 కు సంప్రదించాలని ఎన్టీఏ కోరింది.

రాజస్థాన్‌‌లో అసలేం జరిగింది?

రాజస్తాన్‌‌లోని సీకర్‌‌లో నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. పరీక్షకు ఒక రోజు ముందే పంపిణీ చేసిన 'గెస్ పేపర్లు', అసలు పేపర్‌‌తో  సరిపోలాయని,  ముఖ్యంగా ఫిజిక్స్, బయాలజీ ప్రశ్నలు చాలా వరకు యథాతథంగా వచ్చాయనే కంప్లైంట్స్ వచ్చాయి. స్థానిక పోలీసులు స్పందించకపోవడంతో విద్యార్థులు ఎన్టీఏకు ఫిర్యాదు చేశారు. వెంటనే రాజస్తాన్ డీజీపీ ఏటీఎస్, ఎస్‌‌ఓజీ బృందాలను రంగంలోకి దించారు.  పలు హాస్టళ్లపై దాడులు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నాయి.