బాలింతను 3 రోజులు ముప్పుతిప్పలు పెట్టిన వైద్య సిబ్బంది

బాలింతను 3 రోజులు ముప్పుతిప్పలు పెట్టిన వైద్య సిబ్బంది

బాలింతకు ఇదేం గోస !
కరోనా సింప్టమ్స్‌ ఉండడంతో
హైదరాబాద్‌కు తరలింపు
నల్గొండ, వెలుగు : ఓ బాలింత పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… దేవరకొండ ఏరియా ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం డెలివరీ అయిన ఓ మహిళ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో నల్గొండలోని జిల్లా ఆస్పత్రికి పంపించారు. ఇక్కడి వైద్యులు పరీక్షించే సమయంలో ఫిట్స్‌ రావడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు వెళ్లమని చెప్పారు. కానీ అక్కడి డాక్టర్లు
అడ్మిట్‌ చేసుకోకపోవడంతో గత్యంతర లేక మళ్లీ దేవరకొండకు తీసుకొచ్చారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు ఆమెను కింగ్​కోఠి హాస్పిటల్‌కు వెళ్లాలని చెప్పి చికిత్స చేయకుండా వదిలేశారు. ఈ విధంగా మూడు, నాలుగు రోజుల పాటు దేవరకొండ, నల్గొండ, హైదరాబాద్​ చుట్టూ తిరిగిన ఆమె గురువారం రాత్రి మళ్లీ నల్గొండకు చేరుకుంది.

జిల్లా హాస్పిటల్‌లో ఆమెను పరీక్షించిన డాక్టర్లు గుండె సంబంధిత సమస్య ఉందని గ్రహించి పట్టణంలోని ప్రైవేట్‌ డాక్టర్‌ సాయం తీసుకున్నారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఆస్తమాతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయంటూ డీఎంహెచ్‌వోకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను గాంధీ హాస్పిటల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నల్గొండలో బాధితురాలికి పరీక్షలు చేస్తున్న సమయంలోనే సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి కరెంట్​పోయింది. హాస్పిటల్‌లో జనరేటర్​ పనిచేయకపోవడంతో డాక్టర్లు నానా తిప్పలు పడ్డారు. కరెంట్ వచ్చేంత వరకు వేచిచూసి వైద్య సేవలు అందించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి