ప్రజాపాలన దరఖాస్తులపై నిర్లక్ష్యం

ప్రజాపాలన దరఖాస్తులపై నిర్లక్ష్యం
  •     ఓ అధికారిని సస్పెండ్ చేసిన  బల్దియా కమిషనర్

హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. హయత్ నగర్ సర్కిల్ లో ట్యాక్స్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎస్. మహేందర్ ను బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ మంగళవారం సస్పెండ్ చేశారు. వార్డు నంబర్.13కు మహేందర్ టీమ్ లీడ్ గా ఉండగా.. అప్లికేషన్ల తరలింపుపై నిర్లక్ష్యంగా ఉండడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ప్రభుత్వం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. హయత్ నగర్ సర్కిల్ కు చెందిన దరఖాస్తులను కూకట్ పల్లిలో ఏజెన్సీ డేటా ఎంట్రీ చేస్తుంది.  సోమవారం ఉదయం అక్కడికి తరలించేందుకు ర్యాపిడోని బుక్ చేసుకుని వెళ్తుండగా.. దరఖాస్తులు బాలానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంతెనపై ఎగిరిపోయి చిందరవందరగా కిందపడ్డాయి.

దీంతో వాహనదారుడు బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలిపి దరఖాస్తులను తీసుకుంటుండగా స్థానికులు చూసి ప్రశ్నించగా తనకేమి తెలియదని బైక్ బుకింగ్ చేస్తే తీసుకెళ్తున్నానని సమాధానం ఇచ్చాడు. ఇదంతా వీడియో తీసి సోషల్​ మీడియాలో వైరల్ చేయడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదేశించిగా దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించిన   సూపరింటెండెంట్ మహేందర్ ను అధికారులు సస్పెండ్ చేశారు.

కుత్బుల్లాపూర్ లోనూ అభయహస్తం దరఖాస్తులు  ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కనిపించాయి. డేటా ఎంట్రీకి అప్లికేషన్లను ఇంటికి తీసుకెళ్తుండగా.. కొందరు వ్యక్తులు పట్టుకొని ప్రశ్నించారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ప్రజాపాలన దరఖాస్తులపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, తప్పులు జరిగితే  చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.