- మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : ప్రధాని మోదీ 12 ఏండ్ల పాలన పేరుతో... జవహర్‌లాల్ నెహ్రూను తక్కువ చేసి మాట్లాడడం చరిత్రను అవమానించడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశం ఆహార కొరత, నిరుద్యోగం, పారిశ్రామిక వెనుకబాటుతనం, మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడిందని, అలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడివ నాయకుడు నెహ్రూ అని కొనియాడారు.
నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలే భారత అభివృద్ధికి మూలస్తంభాలన్నారు. భాక్రా నంగల్, నాగార్జునసాగర్ వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని జవహర్‌లాల్ నెహ్రూతో పోల్చడం అంటే చరిత్రపై అవగాహన లేకపోవడమేనన్నారు.
నెహ్రూ విజయాలను తమ ఖాతాలో వేసుకోవడం మోదీ ప్రభుత్వానికి తగదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్న దగ్గుబాటి పురందరేశ్వరి వంటి నాయకులు సైతం చారిత్రక వాస్తవాలను మర్చిపోయి మాట్లాడటం బాధాకరమన్నారు. 12 ఏండ్ల మోదీ పాలనలో ప్రజా సమస్యలను పక్కన పెట్టేశారని విమర్శించారు.
