డాక్టర్‌‌ రెడ్డీస్‌‌కు లాభాలే

డాక్టర్‌‌ రెడ్డీస్‌‌కు లాభాలే

హైదరాబాద్‌‌, వెలుగు : రెవ్‌‌లిమిడ్‌‌ బ్రాండ్‌‌ అమ్మకంతో వచ్చిన ఆదాయం కారణంగా డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ లేబొరేటరీస్‌‌ లిమిటెడ్ జూన్‌‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో అంచనాలను అందుకుంది. అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్‌‌తో పోలిస్తే ఈ నికరలాభం 45 శాతం పెరిగి రూ. 662.80 కోట్లకు చేరింది. రెవ్‌‌లిమిడ్‌‌ క్యాప్సూల్స్‌‌ బ్రాండ్‌‌ను డాక్టర్ రెడ్డీస్‌‌ కెనడా కంపెనీ సెల్జీన్‌‌కు అమ్మేసింది. ఆ ఒప్పందం కింద కంపెనీకి మొదటి క్వార్టర్లో రూ. 350 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం లేకుంటే నికరలాభం అంతంతమాత్రమే. ఏప్రిల్‌‌– జూన్‌‌ క్వార్టర్లో డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ ఆదాయం కూడా కొద్దిగా అంటే 3 శాతం మాత్రమే పెరిగి రూ. 3,844 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయంలో గ్లోబల్‌‌ జెనిరిక్స్‌‌ వ్యాపారం ద్వారా వచ్చినది రూ. 3,298 కోట్లు (80 శాతం). ఉత్తర అమెరికా మార్కెట్లో  అమ్మకాలు రూ. 1,632 కోట్లు. మొదటి క్వార్టర్లో అయిదు కొత్త ప్రొడక్ట్స్‌‌ టెస్టోస్టిరోన్‌‌ జెల్‌‌, విటమిన్‌‌ కే, టోబ్రామైసిన్‌‌, ఓటీసీ కాల్షియం కార్బొనేట్‌‌తోపాటు, ఐసోట్రెటినాయిన్​ను మళ్లీ మార్కెట్లోకి తెచ్చినట్లు డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ లేబొరేటరీస్‌‌ వెల్లడించింది.

మొదటి క్వార్టర్లో రిసెర్చ్‌‌ అండ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కోసం రూ. 361 కోట్లు (ఆదాయంలో 9.4 శాతం) వెచ్చించారు. పూర్తి ఏడాదికి ఆర్‌‌ అండ్‌‌ డీ వ్యయం ట్రెండ్‌‌ ఇంచుమించుగా ఇలాగే ఉంటుందని కంపెనీ సీఎఫ్‌‌ఓ సోమెన్‌‌ చక్రవర్తి చెప్పారు. కొన్ని ప్రొడక్ట్స్‌‌ అమ్మకాలు భారీగా పడిపోవటంతో ఫార్మాసూటికల్​ సర్వీసెస్‌‌ అండ్‌‌ యాక్టివ్‌‌ ఇన్‌‌గ్రీడియెంట్స్‌‌ ఆదాయం 16 శాతం తగ్గి రూ. 450 కోట్లకే పరిమితమైందని సీఓఓ ఎరెజ్‌‌ ఇజ్రేలి తెలిపారు. ఆ ప్రొడక్ట్స్‌‌ అమ్మకాలు మళ్లీ పెరిగేలా కంపెనీ చొరవ తీసుకుంటోందని, రెండో క్వార్టర్‌‌ నుంచే ఆ ఫలితాలు కనబడతాయని వెల్లడించారు. రష్యా సహా  ఎమర్జింగ్‌‌ మార్కెట్లలో అమ్మకాలు పది శాతం పెరిగి రూ. 730 కోట్లకు చేరగా, యూరప్‌‌లో సేల్స్‌‌ 19 శాతం ఎగిసి రూ. 240 కోట్లకు చేరాయి. కొత్త ప్రొడక్ట్స్‌‌ను తేవడంతో ఇండియాలో వ్యాపారం 15 శాతం పెరిగి 700 కోట్లకు చేరింది.  కీలకమైన డెర్మా ప్రొడక్ట్స్‌‌ను అమ్మేయడంతో ప్రొప్రైటరీ ప్రొడక్ట్స్‌‌ డివిజన్‌‌ అమ్మకాలు 61 శాతం తగ్గి రూ. 28 కోట్లకే పరిమితమయ్యాయి.

ఎక్విజిషన్స్‌‌పై గురి…

అప్పులు పెద్దగా లేకపోవడంతో కంఫర్టబుల్‌‌ పొజిషన్‌‌లో ఉన్నామని చెబుతూ, తాజాగా కంపెనీల కొనుగోళ్లపై శ్రద్ధ పెట్టనున్నట్లు డాక్డర్‌‌ రెడ్డీస్‌‌ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఏ ప్రొడక్ట్స్‌‌, ఏ విభాగం, ఏ దేశం, ఎంత మొత్తంతో అనే వివరాలేవీ వెల్లడించకపోయినా, ఆర్థిక వృద్ధి కొనసాగించడానికి ఎక్విజిషన్సే మార్గమని కంపెనీ గుర్తించినట్లు తెలుస్తోంది. బలమైన ఫార్మా కంపెనీగా కొనసాగాలంటే నిరంతర రిసెర్చ్, కొత్త ప్రొడక్ట్స్‌‌తోపాటు కొత్త దేశాలకు విస్తరణ కీలకమైనవిగా నిపుణులు చెబుతుంటారు. ఉత్తర అమెరికాలో జెనిరిక్స్‌‌ మార్జిన్స్‌‌ గణనీయంగా తగ్గిపోతుండటం ఇండియాలోని ఇతర కంపెనీలలాగే డాక్టర్ రెడ్డీస్‌‌ లేబొరేటరీస్‌‌ను కలవరపరుస్తోందని ఆ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బహుశా ఈ నేపథ్యంలోనే తన పొజిషన్‌‌ను స్థిరపరచుకోవడానికి ఎక్విజిషన్స్‌‌ వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటోందని అభిప్రాయపడుతున్నారు.

మరో రెండు కీలక నిర్ణయాలు…

ఆడిటెడ్‌‌ రిజల్ట్స్‌‌ పరిగణనలోకి తీసుకోవడంతోపాటు డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ డైరెక్టర్ల బోర్డు మరో 2 కీలక మార్పులనూ సోమవారం ప్రకటించింది. వాటిలో ఒకటి, సీఓఓ ఎరెజ్‌‌ ఇజ్రేలిని ఆగస్టు 1 నుంచి చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ ఆఫీసర్‌‌ (సీఈఓ)గా నియమించడం. ఏప్రిల్‌‌ 2018 లో ఇజ్రేలి సీఓఓగా నియమితులైన విషయం తెలిసిందే. రోజువారీ కార్యకలాపాల బాధ్యతల నుంచి తప్పుకుని మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌గా తాను బాధ్యతలు నిర్వహించనున్నానని కో ఛైర్మన్‌‌, ఎండీ జీ వీ ప్రసాద్‌‌ వెల్లడించారు. బోర్డు ఆమోదించిన రెండో ప్రపోజల్‌‌,  డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ లేబొరేటరీస్‌‌ లిమిటెడ్‌‌లో 24.88 శాతం వాటా ఉన్న డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ హోల్డింగ్స్‌‌ లిమిటెడ్‌‌ (డీఆర్‌‌హెచ్‌‌ఎల్‌‌– ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ కంపెనీ)ని డాక్టర్ రెడ్డీస్‌‌ లేబొరేటరీస్‌‌ లిమిటెడ్‌‌లో విలీనం చేయాలని. ఈ విలీన ప్రతిపాదన వాటాదారుల ఆమోదం పొందితే డీఆర్‌‌హెచ్‌‌ఎల్‌‌ వాటాదారులకు డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ లేబొరేటరీస్‌‌ లిమిటెడ్‌‌ షేర్లు జారీ చేస్తారు.

విలీన ప్రతిపాదన కోసం డీఆర్‌‌హెచ్‌‌ఎల్‌‌ విలువ లెక్కకట్టడానికి నియమితమైన వ్యాల్యూయర్‌‌ ఇప్పటికే నివేదిక ఇచ్చారు. ఇదేవిధంగా మర్చంట్‌‌ బ్యాంకర్‌‌, ఎడ్వైజర్లను కూడా నియమించారు. వాటాదారుల ఆమోదంతోపాటు ఈ ప్రతిపాదనకు ఎన్‌‌సీఎల్‌‌టీ అనుమతి, ఇతర రెగ్యులేటరీ అనుమతులూ కూడా అవసరమని డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ తెలిపింది. రెండు కంపెనీలలోనూ ప్రమోటర్లు ఒకరే కావడంతో రిలేటెడ్‌‌ పార్టీ ట్రాన్సాక్షన్‌‌గా పరిగణించి, ఈ విలీనాన్ని ప్రతిపాదిస్తున్నారు. డీఆర్‌‌హెచ్‌‌ఎల్‌‌లో సతీష్‌‌ రెడ్డి హెచ్‌‌ఎయూఎఫ్‌‌కు 3.3 శాతం, జీ వీ ప్రసాద్‌‌కు 0.85 శాతం వాటా ఉండగా, ఏపీఎస్‌‌ ట్రస్ట్‌‌ చేతిలో 20.67 శాతం వాటా ఉంది. ఈ ట్రస్ట్‌‌లో డాక్టర్‌‌ అంజి రెడ్డి కుటుంబంలోని సభ్యులు, వారసులు మెంబర్లుగా ఉన్నారని కంపెనీ తెలిపింది. షేర్‌‌ హోల్డింగ్‌‌ స్ట్రక్చర్‌‌ను సులభతరం చేయాలనే ఉద్దేశంతోనే డీఆర్‌‌హెచ్‌‌ఎల్‌‌ విలీనాన్ని ప్రతిపాదిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్‌‌ వెల్లడించింది. విలీనానికి ముందు, విలీనం తర్వాత ప్రమోటర్ల వాటాలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. నిర్వహణా సౌలభ్యం కోసమే గతంలో డీఆర్‌‌హెచ్‌‌ఎల్‌‌ ఏర్పాటైందని, ఇప్పుడూ అదే లక్ష్యంతో ఆ కంపెనీని విలీనం చేసుకోవాలనుకుంటున్నామని పేర్కొంది.