ప్రభుత్వ గెజిట్ లో నేతకాని కులం పేరును సరిచేయాలి..మంత్రి వివేక్ వెంకటస్వామికి సంఘం ప్రతినిధుల వినతి

ప్రభుత్వ గెజిట్ లో నేతకాని కులం పేరును సరిచేయాలి..మంత్రి వివేక్ వెంకటస్వామికి సంఘం ప్రతినిధుల వినతి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ గెజిట్, అధికారిక రికార్డుల్లో ‘నేతకాని’ కులం పేరును సరిచేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని నేతకాని సేవా సంఘం నేతలు కోరారు. సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం స్వామి, దుర్గం సిద్ధార్థ రామ్మూర్తి.. మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం కొన్ని అధికారిక పత్రాలు, నమోదు ప్రక్రియల్లో ‘నేతకాని’కి బదులుగా ‘మలసాలె/నెట్కాని’ అంటూ తప్పుగా నమోదవుతోందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.

దీనివల్ల ఆ వర్గానికి చెందిన వారు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నేతకాని కులస్తులు ఖమ్మం, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని సుమారు 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నారని వివరించారు. అధికారిక రికార్డులు, గెజిట్ ప్రకటనలు, కుల ధ్రువీకరణ పత్రాల్లో ‘నేతకాని’ పేరునే ఏకరీతిగా నమోదు అయ్యేలా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని  మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో ఈ విషయాన్ని చర్చించి అవసరమైన సవరణలు చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.