8 నుంచి పూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ : రేవంత్

8 నుంచి పూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ : రేవంత్

రేపటి నుంచి (డిసెంబర్ 8) ప్రగతి భవన్ లో ప్రజాదర్బర్ నిర్వహిస్తామని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ వచ్చిందని అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు. పదేళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు మౌనంగా భరించారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ఇప్పటికే ప్రగతిభవన్‌ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు. శుక్రవారం (డిసెంబర్ 8న) ఉదయం జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని, మీ బిడ్డగా.. మీ సోదరుడిగా మీ బాధ్యతలను తాను నిర్వహిస్తానని రేవంత్‌ చెప్పారు.

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.