కొత్త గనులు వస్తేనే.. సింగరేణికి మనుగడ..మంత్రి వివేక్ వెంకటస్వామి

కొత్త గనులు వస్తేనే.. సింగరేణికి మనుగడ..మంత్రి వివేక్ వెంకటస్వామి
  • సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుపై సీఎంతో మాట్లాడ్తానని వెల్లడి

గోదావరిఖని, వెలుగు: కొత్త గనులతోనే సింగరేణికి మనుగడ ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీడీకే 11వ గనిలో శ్రమశక్తి అవార్డు గ్రహీత, కాంగ్రెస్ సీనియర్ నేత పి.మల్లికార్జున్ పదవీ విరమణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో వేలంలో పాల్గొనకపోవడం వల్ల కొత్తగా ఒక్క బొగ్గు బ్లాక్ కూడా రాలేదని, దీనివల్ల కార్మికుల్లో అభద్రతాభావం పెరిగిందన్నారు. సింగరేణి ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిర్యాల జిల్లాలో కొత్తగా ఆర్కే ఓపెన్ కాస్ట్ వచ్చిందని, ప్రభుత్వ ఒత్తిడితో తాడిచర్ల బ్లాక్-2 కూడా కేటాయించారని వివరించారు. 

బీఆర్ఎస్ అసమర్థత వల్లే సత్తుపల్లి, కోయగూడెం డిప్ సైడ్ బ్లాక్‌‌‌‌లు ప్రైవేట్ కంపెనీల పరమయ్యాయని, వాటిని కూడా కేంద్రం సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. మరిన్ని గనులు దక్కించుకునేందుకు సింగరేణి వేలంలో పాల్గొంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి టార్గెట్ 100 మిలియన్ టన్నులకు చేరుకోవాలని, అప్పుడే సంస్థకు, కార్మికులకు మంచి జరుగుతుందని తెలిపారు. 

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కాంట్రాక్టు కార్మికులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కార్మిక సంఘాలు, సీఐటీయూతో మాట్లాడి వారి వేతనాలు పెంచామని, ఇది రాష్ట్ర చరిత్రలో గొప్ప విజయమని వెల్లడించారు. సింగరేణిలో కూడా కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు, పర్మినెంట్ కార్మికుల సొంతింటి కల, మెడికల్ బోర్డు నిర్వహణ తదితర సమస్యలపై చర్చించేందుకు త్వరలోనే సీఎంతో సమావేశం అవుతామన్నారు. 

సింగరేణితో కాకా వెంకటస్వామి కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, ఆనాటి నుంచి తనతోపాటు కాకా మనమడు గడ్డం వంశీని ఆదరిస్తున్న ఈ ప్రాంత ప్రజలు, కార్మికులకు రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి, మాజీ ఎమ్మెల్సీ బి. వెంకట్రావు, ఎన్టీపీసీ ఎన్‌‌‌‌బీసీ మెంబర్ బాబర్ సలీంపాషా, గని మేనేజర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.