
- ‘వెలుగు’ ఇంటర్వ్యూలో మంచిర్యాల కొత్త కలెక్టర్ కుమార్‌దీపక్
- ధరణి, పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తున్నాం
- మున్సిపాలిటీలు, గ్రామాల్లో శానిటేషన్మెరుగుపరుస్తం
- అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు
- సమస్యలుంటే వాట్సాప్చేయండి
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ప్రజలకు అత్యవసరమైన విద్య, వైద్య రంగాలపై ఎక్కువ ఫోకస్ పెడతామని మంచిర్యాల కొత్త కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు. ధరణి పెండింగ్ ఫైళ్లను గడువులోగా క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రెవెన్యూ, ఫారెస్ట్అధికారుల కో ఆర్డినేషన్‌తో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో శానిటేషన్ మెరుగుపరుస్తామని, సీజనల్ వ్యాధులను కంట్రోల్ చేస్తామని చెప్పారు. అధికారులు ప్రజల కోసం పనిచేయాలని, అవినీతికి పాల్పడితే యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదన్నారు. ‘వెలుగు’ ఇంటర్వ్యూలో కలెక్టర్ పలు విషయాలపై మాట్లాడారు.
సర్కారు స్కూళ్లలోనే నాణ్యమైన విద్య
సర్కారు స్కూళ్లలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ.17 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చింది. స్కూళ్ల రీఓపెనింగ్రోజునే స్టూడెంట్లకు టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించాం. సర్కారు స్కూళ్లలో క్వాలీఫైడ్ టీచర్లు ఉన్నారు. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు. నేను మందమర్రి మండలం సారంగపల్లి ప్రైమరీ స్కూల్‌ను విజిట్ చేశాను. అక్కడ ఇద్దరు స్టూడెంట్లు, ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. పిల్లల సంఖ్య పెరిగితే అవసరమైన టీచర్లను నియమిస్తాం. సర్కారు స్కూళ్ల విషయంలో పేరెంట్స్ఒపీనియన్ మార్చుకోవాలి. పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లకే పంపాలి.
వైద్యసేవలు మెరుగుపరుస్తాం
జిల్లాలోని గవర్నమెంట్హాస్పిటళ్లలో వైద్యసేవలు మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటాం. అవసరమైన డాక్టర్లు, స్టాఫ్‌ను నియమిస్తాం. శానిటేషన్‌పై దృష్టి పెడుతాం. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలి. పేషెంట్లకు మానవతా దృక్పథంతో ట్రీట్మెంట్ చేయాలి. ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్టు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. అన్ని హాస్పిటళ్లలో బయోమెట్రిక్ అడెండెన్స్ సిస్టమ్ అమలు చేస్తాం. ప్రజాప్రతినిధుల సహకారంతో మెడికల్‌కాలేజీ, జనరల్ హాస్పిటల్, ఎంసీహెచ్ లోవర్క్స్త్వరగా కంప్లీట్‌చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.
ధరణి, పోడు సమస్యలకు పరిష్కారం
ధరణి పెండింగ్‌ఫైళ్లను గడువులోగా క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. వివాదాలు, కోర్టు కేసులు ఉన్నవి మినహా మిగతా వాటిని వారం పది రోజుల్లో పరిష్కరిస్తాం. జిల్లాలో పోడు భూముల సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల కో ఆర్డినేషన్‌తో పరిష్కరించాలని ఆదేశాలిచ్చాం. పోడు రైతులు హక్కు పత్రాల మేరకు సాగు చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్లేదు. అంతకుమించి ఆక్రమించుకుంటే సమస్యలు వస్తాయి. అందుకే పోడు భూములను జియో ట్యాగింగ్ చేస్తాం. పోడు రైతులపై దాడులు చేయొద్దని, ట్రాక్టర్లు సీజ్ చేయవద్దని ఫారెస్ట్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చాం.
సీజనల్ వ్యాధులపై అలర్ట్
వానాకాలంలో సీజనల్వ్యాధులు, అంటురోగాలు వచ్చే చాన్స్ ఎక్కువ. వీటిని కంట్రోల్ చేయడానికి మున్సిపాలిటీలు, గ్రామాల్లో శానిటేషన్ మెరుగుపర్చుతాం. క్లోరినేషన్ వాటర్ సప్లయ్ చేయడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేపడుతాం. అంటువ్యాధులను అరికట్టడానికి ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. విషజ్వరాలు, టైఫాయిడ్, డెంగీపై అలర్ట్‌గా ఉన్నాం. మెడికల్ అండ్హెల్త్ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్‌తో రెడీగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు కొరత లేకుండా చూస్తాం.
ఇల్లీగల్ వెంచర్లపై యాక్షన్
జిల్లావ్యాప్తంగా ఇల్లీగల్ రియల్ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. నాలా, డీటీసీపీ లే అవుట్ లేకుండానే ప్లాటింగ్ చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. కొంతమంది వ్యవసాయ భూముల్లో వెంచర్లు చేసి ఫామ్‌ల్యాండ్స్ పేరిట అమ్ముతున్నారు. ఇలాంటి వాటిపై సర్కారు సీనియస్‌గా ఉంది. లే అవుట్ పర్మిషన్ లేకుండా సబ్ రిజిస్ట్రార్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తే యాక్షన్ తీసుకుంటాం. జిల్లాలో గవర్నమెంట్ భూములు, చెరువుల కబ్జాలను అరికడుతాం. అక్రమ నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.
వరదలొస్తే ఎదుర్కొంటాం..
వానాకాలంలో మంచిర్యాల టౌన్‌లోని పలు కానీలకు వరద ముప్పు ఉంది. అయినప్పటికీ ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. వివిధ శాఖల సమన్వయం, ఫ్లడ్ రెస్క్యూ టీమ్సహాయంతో వరదల నుంచి ప్రజలను కాపాడుతాం. కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. మున్సిపాలిటీలు, ఎంపీడీవో ఆఫీసుల్లో ప్రజాపాలన కౌంటర్లలో దరఖాస్తులు అందించవచ్చు. అత్యవసరమైతే 9492120800 నంబర్‌కు వాట్సాప్ చేస్తే స్పందిస్తా. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య కలెక్టరేట్లో విజిటర్స్‌కు అందుబాటులో ఉంటా. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజల కోసం నిజాయతీగా పనిచేయాలి. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు.