ప్రాజెక్టులకు లోన్ల కోసం కొత్త కార్పొరేషన్‌‌

ప్రాజెక్టులకు లోన్ల కోసం కొత్త కార్పొరేషన్‌‌
  • మంజీరా ఇరిగేషన్‌‌ కార్పొరేషన్​ ఏర్పాటుకు సర్కారు చర్యలు
  • దీని కింద సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు లోన్లు 
  • నల్గొండ లిఫ్టులకు కాళేశ్వరం కార్పొరేషన్‌‌ నుంచి  4 వేల కోట్ల అప్పు?

హైదరాబాద్‌‌, వెలుగు: ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులకు లోన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేయనుంది. సింగూరు ప్రాజెక్టు ఆధారంగా చేపట్టే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు లోన్లు తీసుకునేందుకు మంజీరా ఇరిగేషన్‌‌ కార్పొరేషన్​ను ఏర్పాటు చేయబోతున్నది.  రూ.4,427 కోట్లతో ఈ లిఫ్టులు నిర్మించనుంది. బడ్జెట్‌‌ నుంచి నిధులు కేటాయించే అవకాశం లేకపోవడంతో ఈ ఎత్తిపోతల పథకాల కోసమే కొత్తగా కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేయనుంది. నాగార్జునసాగర్‌‌ ఉప ఎన్నిక సమయంలో శంకుస్థాపన చేసిన నల్గొండ లిఫ్టులకు కాళేశ్వరం ఇరిగేషన్‌‌ కార్పొరేషన్‌‌ నుంచి రూ. 4 వేల కోట్ల లోన్​ కోసం ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

ఇప్పటికే రెండు కార్పొరేషన్లు
ప్రాజెక్టులకు లోన్లు తీసుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఇరిగేషన్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేయగా..  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం ఇరిగేషన్‌‌ ప్రాజెక్టు కార్పొరేషన్​ను కూడా ఏర్పాటు చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్‌‌ కింద కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు –- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి లోన్లు తీసుకుంటున్నారు. 

ఈ కార్పొరేషన్‌‌ ద్వారా కొత్తగా నల్గొండ లిఫ్ట్‌‌లకు లోన్లు సమకూర్చడానికి ప్రతిపాదనలు రెడీ చేశారు. నాగార్జునసాగర్‌‌ ఉప ఎన్నిక  టైంలో సీఎం కేసీఆర్‌‌ నెల్లికల్‌‌ సహా 16 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. వాటికి రూ. 3,691 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్‌‌ శాంక్షన్‌‌ ఇచ్చారు. వీటికి అదనంగా మరో ఆరు చిన్న ఎత్తిపోతల పథకాలు చేపట్టడం, నెల్లికల్‌‌ నిర్మాణ వ్యయం పెరగడంతో ఖర్చు రూ. 4 వేల కోట్లు దాటింది. నెల్లికల్‌‌, ముక్త్యాల బ్రాంచ్‌‌ కెనాల్‌‌, దున్నపోతులగండి, బోతలపాలెం, జాన్‌‌పహడ్‌‌ దర్గా, ఏకేబీఆర్‌‌, పెద్దవాగుతండా, అయిటిపాముల తదితర ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఈ పనులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి చేయకుంటే ఓట్లు అడుగబోమని సీఎం కేసీఆర్‌‌ గతంలో హామీ ఇచ్చారు. బడ్జెట్‌‌లో వీటికి నిధులు సమకూర్చే అవకాశం లేకపోవడంతో లోన్లు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ లిఫ్టులను కాళేశ్వరం కార్పొరేషన్‌‌ పరిధిలో చేర్చబోతున్నారు. ఇందుకు సంబంధించిన పేపర్‌‌వర్క్‌‌ పూర్తి చేసి త్వరలోనే ప్రభుత్వానికి ఆఫీసర్లు రిపోర్టు ఇవ్వనున్నారు. 

ప్రాజెక్టుల కోసం మొత్తం రూ. 1.35 లక్షల కోట్ల అప్పులు
ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చేసిన, చేయబోతున్న మొత్తం అప్పులు రూ. 1.35 లక్షల కోట్లకు చేరనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వివిధ బ్యాంకుల కన్సార్షియం, రూరల్‌‌ ఎలక్ట్రిఫికల్‌‌ కార్పొరేషన్‌‌, పవర్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌, నాబార్డు తదితర సంస్థల నుంచి రూ. 90 వేల కోట్లకు పైగా, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 11 వేల కోట్ల లోన్‌‌ తీసుకున్నారు. దేవాదుల, సీతారామ, సీతమ్మసాగర్‌‌ వరద కాల్వల కోసం ఇరిగేషన్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ కార్పొరేషన్‌‌  ద్వారా రూ. 21 వేల కోట్ల వరకు లోన్‌‌ తీసుకున్నారు. చెక్‌‌ డ్యాంలు, ఇతర పనుల కోసం నాబార్డు నుంచి రూ. 1,200 కోట్ల లోన్‌‌ తీసుకున్నారు. మంజీరా కార్పొరేషన్‌‌తో పాటు నల్గొండ లిఫ్టుల అప్పులు, రెండో ఫేజ్‌‌ చెక్‌‌ డ్యాంలు, ఇతర పనుల లోన్లు లెక్కలోకి తీసుకుంటే మొత్తం ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల అప్పులు రూ. 1.35 లక్షల కోట్లకు చేరనున్నాయి.