- ఈ నెల16 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లకు ఛాన్స్
హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు కొన్ని కొత్త డిగ్రీ కోర్సులు దోస్త్ పోర్టల్‌లోకి చేరాయి. యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) నుంచి అనుమతులు రావడంతో వాటిని వెబ్ కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తుండటంతో విద్యార్థులు తమకు నచ్చిన కొత్త కోర్సులను ఎంచుకునే అవకాశం లభించింది. రాష్ట్రంలోని ఐదు ప్రధాన యూనివర్సిటీల పరిధిలో మొత్తం 11 రకాల కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
ఈ కోర్సుల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ఓయూ మినహా మిగిలిన నాలుగు వర్సిటీల్లో రెండు రోజుల క్రితమే పోర్టల్‌లో పెట్టగా, ఉస్మానియా వర్సిటీలోని కోర్సులు మాత్రం మంగళవారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
16 వరకు గడువు
ఇప్పటికే దోస్త్ మొదటి, రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం మూడో విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు గడువు ఉంది. కొత్త కోర్సులపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న సమయంలో ఈ కోర్సులు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ఉస్మానియా వర్సిటీలో
బీకామ్ – ఫైనాన్స్ టెక్నాలజీ
బీకామ్ – ఇంటర్నేషనల్ బ్యాకింగ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్
బీకామ్ – ఈకామర్స్ ఎంకామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్
కాకతీయ వర్సిటీలో
బీఏ – సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ గవర్నెన్స్
బీఏ – డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్
పాలమూరు వర్సిటీలో
బీఏ – డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్
బీకామ్ – ఈకామర్స్, ఎం కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్
బీకామ్ – ఫైనాన్స్ టెక్నాలజీ
శాతవాహన వర్సిటీలో
బీఏ – డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్
బీకామ్ – ఈకామర్స్, ఎం కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్
బీఎస్సీ – డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ
తెలంగాణ వర్సిటీలో
బీఏ – డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్
బీకామ్ – ఈకామర్స్, ఎం కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్
బీఎస్సీ – డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ.
