తెలంగాణ బీజేపీకి త్వరలో కొత్త ఇన్‌‌చార్జ్‌‌లు!

తెలంగాణ బీజేపీకి త్వరలో కొత్త ఇన్‌‌చార్జ్‌‌లు!
  • సంస్థాగత మార్పులపై హైకమాండ్ ఫోకస్
  • తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ స్థానంలో కొత్త నేతలు
  • లోక్‌‌సభ ఎన్నికల కోసం రాష్ట్ర ఇన్‌‌చార్జ్‌‌ను నియమించడంపై సమాలోచనలు
  • జనవరి తొలి వారంలోపు నియామకాలు పూర్తి!.. స్టేట్ చీఫ్‌‌గా కిషన్ రెడ్డినే కొనసాగించే చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. వచ్చే లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ రాజకీయ వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్, ఆర్గనైజేషన్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌, సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ల మార్పుపై కసరత్తు చేస్తున్నది. పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా తరుణ్ చుగ్, ఆర్గనైజేషన్ (సంస్థాగత) ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న సునీల్ బన్సల్, సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న అరవింద్ మీనన్ స్థానంలో మరింత సమర్థులైన నేతలను నియమించడంపై బీజేపీ అగ్ర నేతలు దృష్టి పెట్టినట్లు సమాచారం. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల రాష్ట్ర బీజేపీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా మరో జాతీయ నేతను ఇక్కడకు పంపించే ఆలోచనలో సెంట్రల్ పార్టీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల రాష్ట్ర ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా ప్రకాశ్ జవదేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించినట్లే.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మరో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ను అపాయింట్ చేయనున్నట్లు పార్టీలో చర్చ సాగుతున్నది. వచ్చే నెల మొదటి వారంలోపు ఈ నియామకాలు పూర్తవుతాయని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.

కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డిపై సానుకూలం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే కొనసాగించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా నిర్ణయించినట్లు నేతలు చెప్తున్నారు. లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలకు తక్కువ వ్యవధి ఉండడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు మంచిది కాదని జాతీయ నాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కిషన్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని సీనియర్ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ ఇప్పటికే స్పష్టంచేశారు.

రెట్టింపు సీట్లు సాధించాలని..

రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. ఈసారి ఆ సీట్లను రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ఢిల్లీ పెద్దలు ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు రావడం, 19 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలవడం, ఓట్ల శాతం 7 నుంచి 14 శాతానికి పెరగడంతో సీరియస్‌‌‌‌‌‌‌‌గా దృష్టిపెట్టారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకొని రాష్ట్రంలో పైచేయి సాధించాలని అడుగులు వేస్తున్నది.