కొత్త లిక్కర్​ షాపులు షురూ..రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్స్​

కొత్త లిక్కర్​ షాపులు షురూ..రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్స్​
  • అధికారంలోకి వస్తే బెల్టుషాపులు తొలగిస్తామన్న కాంగ్రెస్​
  • ఎలక్షన్​ ఫలితాలపై లిక్కర్​ వ్యాపారుల్లో ఉత్కంఠ​

వనపర్తి, వెలుగు : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి సరిగ్గా రెండు రోజుల ముందు (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా కొత్త లిక్కర్​షాపులు తెరుచుకున్నాయి.  నవంబర్ 30న పాత మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియడంతో ఆగస్టులోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త లైసెన్స్ లకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేండ్ల కాలానికి టెండర్లు ఆహ్వానించగా.. 2,620 వైన్స్​కు లక్షా 31 వేల 490 దరఖాస్తులు వచ్చాయి.  టెండర్ల అప్లికేషన్​ ఫీజు రూపంలోనే సర్కారుకు ఏకంగా రూ.2,629 కోట్లు సమకూరాయి. షాపులు దక్కిన యజమానులు శుక్రవారం కొత్త వైన్స్ ను​ ప్రారంభించారు. 

రాష్ట్రంలో గతేడు 2,216 లిక్కర్​షాపులు ఉండగా.. సర్కారు ఈసారి కొత్తగా 404 షాపులు ఏర్పాటు చేసింది. దీంతో ఈ సంఖ్య 2,620కి చేరింది. మరో 1,200 బార్లు ఉన్నాయి. కొత్త షాపుల లైసెన్స్​గడువు రెండేండ్ల పాటు (2025, నవంబర్​30 వరకు) ఉంటుంది. బీఆర్ఎస్​ప్రభుత్వం  వైన్ షాపులకు రిజర్వేషన్లను అమలు చేస్తోంది.  దీంతో ఈసారి గౌడ కులస్తులకు 393 షాపులు, ఎస్సీలకు 262 షాపులు, ఎస్టీలకు 95 షాపులు దక్కాయి.  బీఆర్ఎస్​ సర్కారుకు లిక్కర్​ ఆదాయమే ప్రధాన వనరుగా మారింది. గడిచిన తొమ్మిదేండ్లలో మద్యం రూపంలో ప్రజల నుంచి రూ.2 లక్షల కోట్ల ఆదాయాన్ని పిండుకున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఆదాయంలో ఏ ఏటికాయేడు రికార్డులు బ్రేక్​అవుతున్నాయి. నిజానికి తెలంగాణ వచ్చిన కొత్తలో 2014-–15లో  లిక్కర్​ ఇన్​కం రూ.10,880 కోట్లు ఉంటే, 2018–-19 నాటికి రూ.20,850 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత 2021–-22లో రూ.34 వేల కోట్లకు, ఈ ఏడాది రూ.36 వేల కోట్ల దరిదాపుల్లోకి చేరింది. వచ్చే రెండేండ్లలో రూ.80 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు.. ఆమేరకు షాపుల సంఖ్యనూ పెంచింది.

లిక్కర్​ వ్యాపారుల్లో ఆందోళన.. 

బీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ తొమ్మిదేండ్లు లిక్కర్​ వ్యాపారానికి స్వర్ణయుగంలా  మారింది. లిక్కర్​ ఆదాయం పెంపే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో బెల్టు షాపులకు అనుమతులిచ్చింది. రాష్ట్రంలో  ఏ గ్రామానికి వెళ్లినా.. పదికి తక్కువ కాకుండా బెల్ట్ షాపులు ఉన్నాయి.  కార్పొరేషన్లు, పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ వాడవాడలా బెల్టు షాపులు, వైన్స్​ల దగ్గర్లో సిట్టింగ్​ రూంలు దర్శనమిస్తాయి. బెల్టు షాపులకు అడ్డుకట్ట వేయాల్సిన ఆబ్కారీ శాఖ దగ్గరుండి ప్రోత్సహిస్తూ వచ్చింది.ప్రభుత్వ ఆదేశాలే ఇందుకు కారణమనే అభిప్రాయలున్నాయి. దీంతో లిక్కర్​ వ్యాపారులకు లాభాల పంట పండుతోంది. అందుకే గత ఆగస్టులో మద్యం లైసెన్స్​ల కోసం ప్రభుత్వం టెండర్లు పిలవగా.. దక్కించుకునేందుకు లక్షల మంది పోటీపడ్డారు. అయితే, తాము అధికారంలోకి వస్తే  గ్రామాల్లోని బెల్టు షాపులన్నీ తొలగిస్తామని ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.  తాజాగా, కాంగ్రెస్ ​పార్టీ  రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోందని ఎగ్జిట్​ పోల్స్​ చెప్తున్నాయి. దీంతో లిక్కర్​ వ్యాపారుల్లో టెన్షన్​ మొదలైంది. ఒకవేళ బెల్టు షాపులు తొలగిస్తే తమ వ్యాపారాలు దెబ్బతినడం ఖాయమని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి  గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగిస్తే అదే పదివేలని మహిళాలు భావిస్తోంది.