
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేసి, పెండింగ్ లోని డీఏలను రిలీజ్ చేయాలని తెలంగాణ ప్రోగ్రెసీవ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం టీజీఓ భవన్ లో టీపీటీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. టీచర్లకు కామన్ సర్వీస్ రూల్స్ రూపొందించి, వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. టీచర్లకు పెండింగ్ లోని బకాయిలు రిలీజ్ చేయాలన్నారు. అనంతరం టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్ మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై టీఈజేఏసీ నిరంతరం పోరాడుతుందన్నారు.
సర్కారుతో చర్చల నేపథ్యంలో ఉద్యోగులకు త్వరలోనే హెల్త్ కార్డులు అందబోతున్నాయని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్, టీపీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, అడిషనల్ ప్రధాన కార్యదర్శి సారయ్య తదితరులు పాల్గొన్నారు.