తిరువనంతపురం: కేరళలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే కొత్త వ్యాధి బయటపడింది. నేగ్లీరియా ఫౌలెరి అనే వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఈ వ్యాధి మేనింజిటిస్ తరహా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ డిసీజ్. నేగ్లీరియా ఫౌలెరి వైరస్ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కలుషితమైన వాటర్, సరస్సులు, నదులు, శుభ్రం చేయని కొలనులలో ఈ అమీబా వైరస్ విస్తరిస్తోంది.
చాలా సందర్భాల్లో ఈ వైరస్ ప్రాణాంతకంగానూ మారుతోందంటున్నారు డాక్టర్లు. 2025, ఆగస్ట్ 14న ఈ వైరస్ సోకి తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. ఇప్పటి వరకు కేరళలో ఈ వ్యాధి 69 మందికి సోకినట్లు సమాచారం. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ వ్యాధి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ముఖ్యంగా మండలదీక్ష పూజల కోసం లక్షల సంఖ్యలో శబరిమలకు తరలివస్తోన్న అయ్యప్ప మాలధారులకు, అయ్యప్ప భక్తులకు ఆరోగ్య శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ వ్యాధి విజృంభిస్తోన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నది స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని హెచ్చరించింది. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.
