జలుబు, దగ్గు ఉంటే మాస్క్ పెట్టుకోండి : కరోనాపై కేరళ రాష్ట్రం హై అలర్ట్

జలుబు, దగ్గు ఉంటే మాస్క్ పెట్టుకోండి : కరోనాపై కేరళ రాష్ట్రం హై అలర్ట్

కరోనాపై హై అలర్ట్ ప్రకటించింది కేరళ రాష్ట్రం.. 2025, మే నెలలోనే 182 కేసులు అధికారికంగా నమోదు కావటంతో.. అప్రమత్తం అయ్యింది ప్రభుత్వం. కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున.. జనం అంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించటం కలకలం రేపుతోంది. 
సింగపూర్, హాంకాంగ్, పశ్చిమ ఆసియా దేశాల్లో కరోనా విజృంభిస్తుందని.. ఈ క్రమంలోనే అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ మంత్రి అధికారికంగా వెల్లడించటంతో.. కేరళ జనం అప్రమత్తం అయ్యారు.

ఎవరికైనా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్ పెట్టుకోవాలని సూచించారు మంత్రి వీణా జార్జ్. కరోనాలోని ఓమిక్రాన్ JN1, LF7, NB1.8 రకం వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని.. వ్యాధిని ఎక్కువగా వ్యాప్తి చేసే లక్షణాల్లో ఈ వైరస్ లో ఉన్నాయని ప్రకటించింది కేరళ ప్రభుత్వం. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. తీవ్రత తక్కువగా ఉంటుందని.. ఆత్మ రక్షణ అన్నిటికంటే ముఖ్యం అంటూ ప్రజలను హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలు, బస్సులు, రైళ్లు, ఆటోల్లో ప్రయాణించే వారు మాస్క్ లు ధరించాలని.. అదే విధంగా అన్ని ఆస్పత్రుల్లోనూ మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు.

Also Read : ఇది పాత భారత్ కాదు.. కొత్త భారత్

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధిగా ప్రొటోకాల్ పాటించాలని.. రద్దీ లేకుండా చూడాలని.. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఆరోగ్య కార్తకర్తలు, నర్సులు, డాక్టర్లను కూడా ఆదేశించారు మంత్రి. కరోనా లక్షణాలు కనిపించిన వ్యక్తులకు వెంటనే చికిత్స అందించాలని.. నిరాకరించటం నేరం అని కూడా హెచ్చరించారామె. 

కేరళ రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసులపై సమావేశం అయిన రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు.. తీసుకోవాల్సి జాగ్రత్తల చర్చించిన తర్వాత.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. కొట్టాయం జిల్లాలో 57, ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు నమోదయ్యాయని.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కూడా జనానికి సూచించారు మంత్రి. కరోనా కేసులు పెరగకుండా ఎవరికి వారు వ్యక్తిగత భద్రత, శుభ్రత పాటించాలని కేరళ ప్రభుత్వం హై అలర్ట్ ఇచ్చింది.