న్యూయార్క్ లో ఎమర్జెన్సీ విధింపు

న్యూయార్క్ లో ఎమర్జెన్సీ విధింపు

న్యూయార్క్:  కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతోపాటు కొత్తవైరస్‌ ఒమిక్రాన్‌ ప్రబలే ప్రమాదం ఉండటంతో అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రం ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ విధించింది. ఈ మేరకు న్యూయార్క్‌ గవర్నర్ కాథీ హోచుల్ ఉత్తర్వులు జారీ చేశారు. న్యూయార్క్‌లో ఇప్పటివరకు ఓమిక్రాన్‌కు సంబంధించి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయినా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం నమోదైన కేసులు.. ఆయా దేశాల్లోని పరిస్థితి చూస్తుంటే అది వస్తోందని అనిపిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. 
ముందు జాగ్రత్తగా ఆస్పత్రుల్లో సౌకర్యాలను పెంచేందుకు వీలుగా ఇవాళ ఉత్తర్వులు జారీ చేసినట్లు కాథీ హోచుల్‌ వెల్లడించారు. అవసరమైన ముఖ్యమైన, అత్యవసర మందులను ముందే సిద్ధం చేసుకుంటున్నామని వివరించారు. దేశీయంగా కేసులు పెరగడం, ఒక్క శుక్రవారం నాడే న్యూయార్క్‌లో 37 శాతం పెరుగుదల నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగించిందన్నారు. ఓమిక్రాన్‌ కేసులు నమోదు కాకపోయినా కరోనా ప్రబలిన తర్వాత 56 వేల మంది చనిపోయిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.