- 2019 తర్వాత స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా
- మూడో వన్డేలో 41 రన్స్‌తో న్యూజిలాండ్ గెలుపు..2–1తో ఇండియా గడ్డపై తొలి వన్డే సిరీస్ కైవసం
ఇండోర్: ఛేజ్ కింగ్ విరాట్ కోహ్లీ (108 బాల్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 124) వీరోచిత సెంచరీతో విజృంభించినా.. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) ఫిఫ్టీలతో పోరాడినా టీమిండియాకు నిరాశే. స్వదేశంలో 2019 నుంచి వరుసగా 11వన్డే సిరీస్‌లు గెలిచిన ఇండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. గతేడాది టెస్టుల్లో మన జట్టును వైట్‌వాష్ చేసిన న్యూజిలాండ్ ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో ఇండియా గడ్డపై తొలిసారి సిరీస్ గెలుచుకుంది. డారిల్ మిచెల్ (131 బాల్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 137) , గ్లెన్ ఫిలిప్స్ (88 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 106) అద్భుత సెంచరీలకు తోడు బౌలర్లూ రాణించడంతో హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో, చివరి వన్డేలో కివీస్ 41 రన్స్ తేడాతో ఇండియాను ఓడించింది. సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత బ్లాక్ క్లాప్స్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 337/8 స్కోరు చేసింది. ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో కోహ్లీ, నితీష్, హర్షిత్ పోరాడినా ఇండియా 46 ఓవర్లలో 296 రన్స్‌కే ఆలౌటై ఓడింది. కివీస్ బౌలర్లలో క్రిస్టియాన్ క్లార్క్ (3/54), జాక్ ఫౌల్క్స్ (3/77) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. డారిల్ మిచెల్‌కు కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి. ఇరు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ బుధవారం నాగ్‌పూర్‌లో జరుగుతుంది.
కోహ్లీ పోరాడినా..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో ఫెయిలైన ఓపెనర్ రోహిత్ శర్మ (11) నాలుగో ఓవర్లోనే వెనుదిరిగ్గా.. ఉన్నంతసేపు మంచి షాట్లతో అలరించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (23)ను ఏడో ఓవర్లో జేమీసన్ బౌల్డ్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ మొదటి నుంచి తన మార్కు షాట్లతో బౌండ్రీలు రాబట్టినా.. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) క్రీజులో నిలవలేపోయారు. క్లార్క్ బౌలింగ్‌లో శ్రేయస్ వెనుదిరగ్గా.. రాహుల్‌ను లెనోక్స్ ఔట్ చేయడంతో 71/4తో ఇండియా ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో కోహ్లీకి తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి తోడయ్యాడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టిన ఈ ఇద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 51 బాల్స్‌లో ఫిఫ్టీ దాటిన విరాట్ క్లాసిక్ షాట్లతో అలరించగా.. నితీష్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఫౌల్క్స్, ఫిలిప్స్ ఓవర్లలో భారీ సిక్సర్లతో అతను ఫిఫ్టీ పూర్తి చేసుకోగా 27 ఓవర్లకు ఇండియా 157/4తో రేసులో నిలిచింది. కానీ, క్లార్క్ వేసిన తర్వాతి ఓవర్లో యంగ్‌కు క్యాచ్ ఇచ్చి నితీష్ ఔటవడంతో 88 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. వరుసగా ఏడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ ఇవ్వని కివీస్ బౌలర్లు ఆల్‌రౌండర్ జడేజా (12) వికెట్ తీసి ఇండియాను ఒత్తిడిలో పడేశారు. కానీ, 8వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన పేసర్ హర్షిత్ రాణా అనూహ్యంగా రెచ్చిపోయాడు. ఫిలిప్స్ వేసిన 37వ ఓవర్లో కోహ్లీ 4, హర్షిత్ 6 కొట్టి ఛేజింగ్‌కు మళ్లీ ఊపు తెచ్చారు. ఆ వెంటనే ఫౌల్క్స్ బౌలింగ్‌లో 6, 4తో అలరించిన కోహ్లీ అతని ఓవర్లో సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 48 బాల్స్‌లో 89 రన్స్ అవసరమైన దశలో జేమీసన్ వేసిన 43వ ఓవర్లో కోహ్లీ సిక్స్, రాణా 4,6 బాది 21 పరుగులు రాబట్టి విజయంపై నమ్మకం పెంచారు. కానీ, ఫౌల్స్క్ వేసిన తర్వాతి ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన హర్షిత్ మరో షాట్‌కు ట్రై చేసి ఔటవడంతో ఏడో వికెట్‌కు 99 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. తర్వాతి బాల్‌కే సిరాజ్ (0) డకౌటైనా.. కోహ్లీ క్రీజులో ఉండటంతో ఇండియా ఆశలు కోల్పోలేదు. క్లార్క్ వేసిన 46వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీ.. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో లాంగాఫ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆతిథ్య జట్టు ఓటమి ఖాయమైంది. అదే ఓవర్లో కుల్దీప్ (5) లాస్ట్ వికెట్‌గా రనౌటయ్యాడు.
డారిల్, ఫిలిప్స్ సెంచరీల మోత
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే మన పేసర్లు షాకిచ్చారు. ప్రసిధ్ కృష్ణ ప్లేస్‌లో వచ్చిన లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన తొలి ఓవర్లోనే మ్యాజిక్ చేశాడు. ఆఫ్ స్టంప్ లైన్‌పై అద్భుతమైన ఔట్ స్వింగర్ వేసి ఓపెనర్ హెన్రీ నికోల్స్ (0)ను బౌల్డ్ చేశాడు. మరోవైపు యంగ్ పేసర్ హర్షిత్ రాణా ప్రమాదకరమైన డెవాన్ కాన్వే (5)ను వరుసగా మూడోసారి ఔట్ చేశాడు. ఈ దశలో విల్ యంగ్ (30), డారిల్ మిచెల్ మూడో వికెట్‌కు 53 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ, 13వ ఓవర్లో హర్షిత్ బౌలింగ్‌లోనే జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్ 58/3తో కష్టాల్లో పడింది. ఇండియా బౌలర్ల జోరు చూస్తుంటే కివీస్ 250 రన్స్ చేయడం కూడా కష్టమనిపించింది.
కానీ, ఈ సమయంలో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఇండియా బౌలర్లకు ఎదురు నిలిచిన ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 219 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. డారిల్ మిచెల్ మరోసారి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత తీసుకోగా.. ఫిలిప్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కుల్దీప్ యాదవ్‌ను టార్గెట్ చేసి భారీ సిక్స్ కొట్టిన మిచెల్ అతని బౌలింగ్‌లోనే బౌండ్రీతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 34 ఓవర్ల తర్వాత బాల్ మెత్తగా మారడంతో స్ట్రోక్ మేకింగ్ కష్టమైంది. అయినా హోల్కర్ స్టేడియం చిన్న బౌండరీలను డారిల్, ఫిలిప్స్ సమర్థవంతంగా వాడుకున్నారు. నితీష్ బౌలింగ్‌లో చెరో సిక్స్ కొట్టారు. సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్, అర్ష్‌దీప్ ఓవర్లో సిక్స్‌తో ఫిలిప్స్ జోరు చూపెట్టాడు. వీళ్ల దూకుడుతో 40 ఓవర్లకు కివీస్ 237/3తో నిలిచింది. ఈ క్రమంలో మిచెల్ ఈ సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ సాధించగా, ఫిలిప్స్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వంద పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు 44వ ఓవర్లో మిచెల్‌ను ఔట్ చేసిన సిరాజ్ ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ వెంటనే అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఫిలిప్స్ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. జాక్ ఫౌల్క్స్ (10), మిచెల్ హే (2) త్వరగానే ఔటైనా చివర్లో కెప్టెన్ బ్రేస్‌వెల్ (28 నాటౌట్) మెరుపులతో కివీస్ స్కోరు 330 మార్కు దాటింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 50 ఓవర్లలో 337/8 (డారిల్ మిచెల్ 137, గ్లెన్ ఫిలిప్స్ 106, అర్ష్‌దీప్ 3/63, హర్షిత్ రాణా 3/84)
ఇండియా: 46 ఓవర్లలో 296 ఆలౌట్ (విరాట్ కోహ్లీ 124, నితీష్ 53, రాణా 52, క్రిస్టియాన్ క్లార్క్ 3/54, జాక్ ఫౌల్క్స్ 3/77)
11 స్వదేశంలో ఇండియా చివరగా 2019 మార్చిలో ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా 11 సిరీస్‌లు నెగ్గింది.
54 వన్డేల్లో కోహ్లీకి
ఇది 54వ సెంచరీ. కివీస్‌పై ఏడోది.
