కూకట్ పల్లిలో నూతన దంపతుల సూసైడ్

కూకట్ పల్లిలో నూతన దంపతుల సూసైడ్
  • రెండు నెలలు గడవక ముందే విషాదం అంతుచిక్కని కారణాలు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కూకట్​పల్లి, వెలుగు: ప్రేమించి పెండ్లి చేసుకుని రెండు నెలలు కూడా గడవక ముందే నూతన దంపతులు సూసైడ్​ చేసుకున్నారు. అంతా బాగుంది.. అనుకుంటుండగానే దాంపత్య జీవితం విషాదంగా మారింది. ఒకరికొకరు ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్న నవజంట ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్​పల్లిలో శనివారం జరిగింది. కూకట్​పల్లిలో పాత శివాలయం సమీపంలోని కుమ్మరి బస్తీకి చెందిన యాంజాల కార్తీక్​ (28), ఎర్రమల్ల మంజుల (27)  మార్చి 8న పెండ్లి చేసుకున్నారు.

ఇరు కుటుంబాలు బంధువులే అయినప్పటికీ పెద్దలను ఒప్పించి ప్రేమ పెండ్లి చేసుకున్నారు. కార్తీక్ బొల్లారం పారిశ్రామికవాడలోని ఐటీసీ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. పెండ్లికి ముందు ప్రైవేట్ ఉద్యోగం చేసిన మంజుల ఇంటి వద్దే ఉంటుంది. వీరు ఉంటున్న బిల్డింగ్​లోనే కార్తీక్ అన్న, వదిన, తల్లి కూడా నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి అందరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు.

శనివారం ఉదయం 11 గంటలైనా కార్తీక్, మంజుల తలుపులు తియ్యకపోవడంతో కుటుంబ సభ్యులు వారిని ఎంత పిలిచినా స్పందించలేదు. స్థానికుల సహకారంతో తలుపులు పగులగొట్టి చూడగా, కార్తీక్ ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఉండగా, మంజుల నోటి నుంచి నురగతో పడి ఉంది. వెంటనే ఇద్దరినీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భార్యకు పాయిజన్ ఇచ్చి కార్తీక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ దంపతుల సూసైడ్​కు గల కారణాలు ఏమిటనేది మిస్టరీగా మారింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.