అహ్మదాబాద్: టీ20 క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసించి, అహ్మదాబాద్ గడ్డపై విశ్వవిజేతగా నిలిచి టీమిండియా.. ఇప్పుడు తన దృష్టిని సరికొత్త శిఖరంపైకి మళ్లించింది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ క్రికెట్‌లో గోల్డ్ నెగ్గడమే తమ తర్వాతి టార్గెట్‌గా పెట్టుకుంది. 128 ఏండ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టబోతున్న క్రికెట్‌లో మన త్రివర్ణ పతాకాన్ని అత్యున్నత పీఠంపై ఎగురవేయడమే తమ లక్ష్యమని ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
‘మేము వరుసగా మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గాం. 2024 తర్వాత మా జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మా కళ్లముందున్న లక్ష్యం 2028 ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలవడమే. అలాగే ఆ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ను కూడా ముద్దాడతాం. దాన్ని అస్సలు మరవం’ అని సూర్య ధీమా వ్యక్తం చేశాడు. 35 ఏండ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఉన్న సూర్య, 2028 ఒలింపిక్స్ వరకు జట్టును ముందుండి నడిపిస్తాననే ధీమా వ్యక్తం చేశాడు.
నా టార్గెట్ పది ఐసీసీ ట్రోఫీలు: హార్దిక్
ఇండియా ‘మిషన్ ఒలింపిక్ గోల్డ్’లో కీలక పాత్ర పోషించబోతున్న32 ఏండ్ల హార్దిక్ పాండ్యా తనకు మరో 10 ఏండ్ల కెరీర్ ఉందని తెలిపాడు.‘ నా కెరీర్ సగమే పూర్తయింది. నేనింకా పదేండ్లు ఆడతా. నా ఖాతాలో ఇప్పటికే మూడు ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. రిటైర్ అయ్యేలోపు కనీసం 10 ట్రోఫీలు గెలవడమే నా టార్గెట్’ అని పాండ్యా తన కసిని చాటుకున్నాడు.
