V6 News

ఎన్ఎఫ్‌డీబీని తరలించే ఆలోచన లేదు : కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్

ఎన్ఎఫ్‌డీబీని తరలించే ఆలోచన లేదు :  కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్
  •     కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ 
  •     తెలంగాణకు సహకారం అందించాలని కోరిన మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్ఎఫ్​డీబీ)ను తరలించే ఆలోచన లేదని, రాజేంద్రనగర్‌లోనే కొనసాగుతుందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం రాజేంద్రనగర్‌లోని ఎన్ఎఫ్​డీబీ కార్యాలయంలో కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పశుసంవర్ధక, పాడి, మత్స్య రంగాల్లో అమలు చేస్తున్న పథకాలు, వాటి ఫలితాలను వివరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని కోరారు. 

ప్రధానంగా ఆక్వా కల్చర్, లైఫ్ సైన్సెస్‌లో ఇన్సూరెన్స్, మోపెడ్ కేటాయింపులో న్యాయం చేయాలన్నారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న 46 వేల పెద్ద చెరువులు, 26 వేల చిన్న చెరువులు,100 రిజర్వాయర్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమైందని ఆరోపించారు. మత్స్య శాఖ డైరెక్టర్ నిఖిల, పశుసంవర్ధక శాఖ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు