
టెన్నిస్ లోని ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని చూసేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాజరయ్యారు. వింబుల్డన్ మూడో రోజు (జూలై 2) ఆమె మ్యాచ్ చూస్తూ సెంటర్ కోర్ట్ లో తళుక్కున మెరిశారు. ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోన్స్ తో కలిసి మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న ప్రియాంక.. తన షూటింగ్ షెడ్యూల్ కు బ్రేక్ పడడంతో ఈ సరదా సమయాన్ని ఇంగ్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సెంటర్ కోర్ట్ లో జరిగిన అల్కరాజ్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసినట్టు సమాచారం.
ప్రియాంక చోప్రా వింబుల్డన్ చూస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, మాజీ ఫుట్ బాల్ స్టార్ డేవిడ్ బేక్ హామ్ రాయల్ బాక్స్ లో వింబుల్డన్ మ్యాచ్ చూస్తూ కనిపించారు. ఇక ఈ టోర్నీ విషయానికి వస్తే మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–1, 6–4, 6–4తో టార్వెట్ (బ్రిటన్)పై, కామెరూన్ నోరి (బ్రిటన్) 4–6, 6–4, 6–3, 7–5తో తియాఫో (అమెరికా)పై, బోర్గెస్ (పోర్చుగల్) 6–3, 6–4, 7–5 (7)తో బిల్లీ హారిస్ (బ్రిటన్)పై, రబ్లేవ్ (రష్యా) 6–7 (1), 6–4, 7–6 (5), 6–3తో లాయిడ్ హారిస్ (రష్యా)పై, కరెన్ కచనోవ్ (రష్యా) 1–6, 7–6 (7), 4–6, 6–3, 6–4తో షింటారో మోచిజుకి (జపాన్)పై విజయం సాధించి మూడో రౌండ్ లోకి అడుగు పెట్టారు.
మహిళల సింగిల్స్ విషయానికి వస్తే బెలారస్ స్టార్ ప్లేయర్ అరీనా సబలెంక.. వింబుల్డన్‌లో మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ సబలెంక 7–6 (7/4), 6–4తో మారీ బౌజుకోవా (చెక్)పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో మాడిసన్ కీస్ (అమెరికా) 6–4, 6–2తో డానిలోవిచ్ (సెర్బియా)పై, కర్తాల్ (బ్రిటన్ 6–2, 6–2తో టోమోవా (బల్గేరియా)పై, అన్సిమోవా (అమెరికా) 6–4, 6–3తో జరాజువా (మెక్సికో)పై, ప్యారీ (ఫ్రాన్స్) 6–4, 6–1తో ష్నైడర్ (రష్యా), ఒసాక (జపాన్) 6–3, 6–2తో సినియాకోవా (చెక్)పై గెలిచి ముందంజ వేశారు.