పుట్టిన పిల్లలు బతుకుతలేరని.. బాలుడి కిడ్నాప్

పుట్టిన పిల్లలు బతుకుతలేరని.. బాలుడి కిడ్నాప్
  •     వీడిన నిలోఫర్ కిడ్నాప్ కేసు మిస్టరీ
  •     కామారెడ్డికి చెందిన మమత, ఆమె భర్త శ్రీను అరెస్టు 
  •     తనకున్న వ్యాధి కారణంగా ఇద్దరు కొడుకులను కోల్పోయిన మమత 
  •     ఇప్పుడు మరో కొడుకు పరిస్థితి సీరియస్

ఆ తల్లి జన్యుపరమైన హైపర్‌‌‌‌ విస్కోసిటీ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతోంది. దీని కారణంగా పురుట్లోనే ఇద్దరు కొడుకులను కోల్పోయింది. రెండు నెలల కింద మరో కొడుకుకు జన్మనివ్వగా, ఆ బిడ్డ పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. ట్రీట్ మెంట్ కోసమని హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకురాగా, బతకడం కష్టమేనని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ తల్లి ఆవేదన చెందింది. అక్కడే హాస్పిటల్ లో ఓ బాబు.. ఆ తల్లిని చూసి చిరునవ్వు నవ్వగా, ఆ బాబును తీసుకెళ్లి పెంచుకోవాలని అనుకుంది. తన కొడుకును అక్కడే వదిలేసి, ఆ బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. చివరకు సీసీటీవీ కెమెరాలు, సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ టవర్ లొకేషన్‌‌‌‌ ఆధారంగా పోలీసులకు దొరికింది. ఈ నెల 14న నిలోఫర్ ఆస్పత్రిలో జరిగిన కిడ్నాప్ వెనకున్న హృదయవిదారక ఘటన ఇది.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : నిలోఫర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో జరిగిన ఆరు నెలల బాలుడి కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బాబును సిటీ సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు రెస్క్యూ చేశారు. పిల్లాడిని కిడ్నాప్‌‌‌‌ చేసిన దంపతులను అరెస్ట్ చేశారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. తనకు పుట్టిన కొడుకులు బతుకుతలేరనే ఆవేదనతో ఓ తల్లి... తన భర్తతో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. ఈ కేసు వివరాలను సెంట్రల్‌‌‌‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు బుధవారం వెల్లడించారు. గ్రేటర్ లోని గండిపేట్‌‌‌‌ క్రాస్‌‌‌‌ రోడ్స్‌‌‌‌కు చెందిన ఫరీదాబేగం(24)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరు నెలల కొడుకు ఫైజల్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం ఈ నెల14న ఉదయం 11గంటల సమయంలో నిలోఫర్ హాస్పిటల్‌‌‌‌కు వచ్చింది.  

ఇద్దరు కుమారులతో వెయిటింగ్ హాల్‌‌‌‌లో కూర్చుంది. అక్కడే కామారెడ్డి జిల్లా కొత్తబడి తండాకు చెందిన కరోత్‌‌‌‌ మమత(26)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తమ పిల్లల గురించి చర్చించుకున్నారు. తన రెండు నెలల కుమారుడి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం వచ్చానని మమత చెప్పింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన చెందింది. ఈ క్రమంలో ఫైజల్ ను చూసి మమత ముచ్చటపడింది. ఆ పిల్లాడు మమతను చూసి నవ్వడంతో ఎత్తుకుని ప్రేమగా గుండెలకు హత్తుకుంది. సాయంత్రం 6:30 గంటల సమయంలో ఫరీదాబేగం భోజనం కోసం బయటకు వెళ్లగా.. మమత తన కుమారుడిని అక్కడే వదిలేసి, ఫరీదాబేగం కుమారుడు ఫైజల్‌‌‌‌ను కిడ్నాప్‌‌‌‌ చేసి తీసుకెళ్లింది. 

మగ పిల్లలు బతకడం లేదని.. 

మమత హైపర్‌‌‌‌ విస్కోసిటీ సిండ్రోమ్‌‌‌‌తో బాధపడుతున్నది. ఇలాంటి వారిలో ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాలు, రక్త ప్రోటీన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో పుట్టిన మగపిల్లల్లో రక్తం చాలా చిక్కగా ఉంటుంది. దీని కారణంగా రక్తనాళాల్లో ప్రసరణ సరిగా ఉండదు. ముక్కు, ఇతర శరీర భాగాల నుంచి రక్తం కారుతుంది. దీని కారణంగా పుట్టిన మగబిడ్డలు 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలోనే మృతి చెందడం లేదా కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా ఇప్పటికే మమతకు పుట్టిన ఇద్దరు కుమారులు మృతి చెందారు.

ఆమెకు ఉన్న జన్యు సంబంధిత సమస్యల కారణంగా మగబిడ్డలు బతికే పరిస్థితి లేదు. ఆడపిల్లలు పుడితే బతికే అవకాశం ఉంటుంది. కానీ ఆమెకు పుట్టిన ఇద్దరు మగ పిల్లలు ఇప్పటికే మరణించగా, మూడోసారి కూడా బాబు జన్మించాడు. అయితే బాబుకు సీరియస్ గా ఉండడంతో ఆ పిల్లాడు కూడా చనిపోతాడని మమత దంపతులు ఆవేదన చెందారు. ఈ క్రమంలో హాస్పిటల్ లో ఫైజల్ ను చూసిన మమత.. ఆ బాలుడిని తీసుకెళ్లి పెంచుకోవాలని కిడ్నాప్ చేసింది. 

ప్రాణాపాయ స్థితిలో మమత కొడుకు.. 

మమత కొడుకుకు నిలోఫర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తున్నారు. కోర్టు అనుమతితో మమత దంపతులకు కొడుకును చూసుకునే సౌకర్యం కల్పిస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న బాబును కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. అవసరమైతే కార్పొరేట్ హాస్పిటల్‌‌‌‌కి తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.   

సీసీ ఫుటేజీ ఆధారంగా అరెస్టు.. 

బాబు కనిపించకపోవడంతో నాంపల్లి పోలీసులకు ఫరీదాబేగం ఫిర్యాదు చేసింది. నాంపల్లి ఇన్ స్పెక్టర్ అభిలాష్, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రాజు నాయక్ ఆధ్వర్యంలో  4 స్పెషల్‌‌‌‌ టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. హాస్పిటల్‌‌‌‌లోని సీసీటీవీ కెమెరాల్లో బాబును కిడ్నాప్ చేసిన ఓ మహిళను గుర్తించారు. ఆటో నంబర్ ఆధారంగా 100కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. బాబును కిడ్నాప్ చేసిన దంపతులు జేబీఎస్‌‌‌‌ నుంచి బస్సులో బాన్సువాడ వెళ్లినట్టు గుర్తించారు. ఫోన్‌‌‌‌ లొకేషన్ ఆధారంగా మమత, ఆమె భర్త శ్రీను(26)ను బాన్సువాడలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌‌‌‌ తరలించారు.ఫైజల్‌‌‌‌ను ఫరీదాబేగంకు అప్పగించారు.