- ఏసీబీ సోదాల్లో బయటపడిన 2.75 కోట్ల విలువ చేసే ఆస్తులు
- మార్కెట్ ప్రకారం వాటి విలువ 70 కోట్లపైనే ఉంటుందని అంచనా
- పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చుతున్న ఏసీబీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీ భాస్కర్ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కుటుంబ సభ్యులతో పాటు ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఆయన కూడబెట్టిన ఆస్తుల వివరాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా లక్ష్మీభాస్కర్ ఉద్యోగంలో చేరకముందు, చేరిన తర్వాత సంపాదించిన ఆస్తుల లెక్కలు తీస్తోంది. ఈ క్రమంలోనే ఆయన జీతభత్యాలు, ఖర్చులు పోను అధికారికంగా మిగులు, అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలు రాబడుతోంది. కాగా, నిమ్స్‌లో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఆయన సంపాదించిన అక్రమాస్తుల వివరాలను కోర్టుకు అందించింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు లక్ష్మీభాస్కర్ అవినీతికి అద్దం పడుతున్నాయి.
25 ఏండ్లుగా నిమ్స్‌లోనే పాగా
హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన లక్ష్మీ భాస్కర్(56) 2007లో విధుల్లో చేరాడు. కొంత కాలం అడిషనల్ అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్‌గా పనిచేశాడు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి 25 ఏండ్లుగా నిమ్స్‌లోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే నిమ్స్‌లో జరిగే అన్ని కార్యకలాపాల్లో లక్ష్మీ భాస్కర్ కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. నిమ్స్‌లో ఉన్నతాధికారుల సహకారంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం, హాస్పిటల్లో ఫర్మిచర్ సహా విలువైన వైద్య పరికరాలను కొనుగోలు చేయడంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
నిమ్స్ లోపల, బయట మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తానని పలువురు నుంచి అందినంతా వసూలు చేసినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో గత కొంత కాలం క్రితం లక్ష్మీభాస్కర్‌ను అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఇక్కడ కూడా మందుల కోనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
మిగులు ఆదాయం రూ.1.05 కోట్లు.. అక్రమార్జన రూ.1.70 కోట్లు
లక్ష్మీభాస్కర్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గత రెండు నెలల నుంచి ఏసీబీ అతనిపై నిఘా పెట్టింది. ఆయన విధులు, ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సేకరించింది. 2007 జూన్ 10న లక్ష్మీభాస్కర్ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఏసీబీ సోదాలు జరిగిన ఈ నెల 21వ తేదీ వరకు జీత భత్యాలు, ఖర్చులు లెక్కగట్టింది. ఇందులో లక్ష్మీ భాస్కర్‌కు చెందిన మొత్తం ఆదాయం రూ.2 కోట్లు కాగా.. వాటిలో మొత్తం ఖర్చు రూ. 94.33 లక్షలు- పోను రూ. 1,05,67,000 ఆదా అయ్యే అవకాశం ఉంది.
కానీ, సోదాల్లో పట్టుబడిన మొత్తం ఆస్తుల విలువ మాత్రం రూ. 2,75,95,200గా ఏసీబీ నిర్ధారించింది. ఈ లెక్కన రూ.1,70,28,200 ఆదాయానికి మించిన ఆస్తులుగా ఏసీబీ గుర్తించింది. మొత్తంగా ఆయన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట కూడబెట్టిన ఆస్తుల విలువ ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.2,75,95,200- కాగా.. ప్రస్తుత బహిరంగ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం మాత్రం దాదాపు రూ.70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వీటికి సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో అవినీతి నిరోధక చట్టం 1988 (2018లో సవరించబడినది)లోని సెక్షన్ 13(1)(బి),13(2) కింద శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ కోర్టులో రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేసింది.
