హైదరాబాద్, వెలుగు: లైంగిక దాడికి గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న 12 ఏండ్ల బాలికను పరామర్శించేందుకు ఎవరూ నేరుగా రావొద్దని నిమ్స్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఎన్జీవోల ప్రతినిధులు, మీడియా పర్సన్స్ బాధితురాలిని నేరుగా కలవడానికి వస్తుండడం వల్ల బాలిక మానసిక స్థితిపై ప్రభావం పడడంతోపాటు, ఆమె గోప్యతకు భంగం కలుగుతుందని వెల్లడించింది.
బాధితురాలు ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చికిత్స పొందుతోందని, పరామర్శల పేరుతో జనం గుంపులుగా రావడం వల్ల ఐసీయూలో ఉన్న ఇతర క్రిటికల్ రోగులకు కూడా ఇబ్బంది కలుగుతోందని స్పష్టంచేసింది. బాధితురాలు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో కోలుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మెడికల్ సూపరింటెండెంట్ కోరారు. చిన్నారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
