నిర్మల్ వంట విదేశీ ఇంట

నిర్మల్ వంట విదేశీ ఇంట

ఒక్కటయ్యారు. చేయిచేయి కలిపారు. ఆ పరిచయం ఒక మంచి ఆలోచనకు బీజం పడేలా చేసింది. అది కాస్తా ఉపాధి వైపు మళ్లింది. అప్పటివరకు ఖాళీగా కూర్చొని మట్లాడుకునే ఆ నలుగురు పిండి వంటల వ్యాపారం ప్రారంభించారు. అందరికీ తెలిసిన పనే అయినా.. డిఫరెంట్గా చేయడం మొదలుపెట్టారు. చిన్న ఉపాధే కానీ.. చూస్తుండగానే ఆ టేస్ట్ విదేశాలకు పాకింది.
నిర్మల్, వెలుగు : ‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ ఈ మాటను నిజం చేసి చూపారు నిర్మల్ ఆడబిడ్డలు. ఒక చిన్న రూమ్ను అద్దెకు తీసుకొని పిండి వంటల వ్యాపారం ప్రారంభించారు. కొద్దిరోజులకే ఆ రుచి గురించి అందరికీ తెలిసింది. క్వాలిటీతో వంటలు తయారు చేస్తుండటంతో ఆర్డర్ల కోసం విదేశాల నుంచి ఆర్డర్లు ‘క్యూ’ కడుతున్నాయి. ఇప్పుడు ఆ నలుగురు ఉపాధి పొందుతూనే, మరి కొంతమందికి ఆర్థిక భరోసా ఇస్తున్నారు.

వ్యాపారం వైపు అడుగులు


నిర్మల్, ఆదర్శనగర్ కాలనీకి చెందిన బట్టు సునీత, బి. రమాదేవి, ఆర్. విజయ, డి. పద్మ.. ప్రతి శుక్రవారం గాయత్రి ఆలయానికి వెళ్లేవాళ్లు. అక్కడ ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం స్నేహంగా మారింది. అందరి అభిప్రాయాలు ఒక్కటవ్వడంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లు. ప్రతి శుక్రవారం గుడి దగ్గర కలుసుకోవడం, సేవా కార్యక్రమాలు చేయడం దినచర్యగా చేసుకున్నారు. ఒక శుక్రవారం నలుగురు ఒక దగ్గరి చేరి కబుర్లు చెప్పుకుంటుండగా బిజినెస్ ఆలోచన తట్టింది. ‘మనసుకు నచ్చిన, తెలిసిన పని’ ఏదైనా చేస్తే సొంతంగా ఉపాధి దొరుకుతుంది అనుకున్నారు. ఆ ఆలోచనే ఇంట్లోనే పిండి వంటలు తయారుచేయాలని.

పిండి వంటలతో..


గత ఏడాది నిర్మల్, ఆదర్శనగర్లో ఒకరూమ్ను అద్దెకు తీసుకున్నారు. ఒక్కొక్కరు ఇరవై వేలు పోగు చేసి డబ్బులను పెట్టుబడిగా పెట్టి ‘శ్రీ గాయత్రి స్వగృహ ఫుడ్స్’ వ్యాపారం ప్రారంభించారు. ఎవరి సాయం లేకుండా సొంతంగా పిండి వంటలు తయారు చేయడం మొదలుపెట్టారు. సకినాలు, మురుకులు, అరిసెలు, చెకోడీలు, లడ్డూలు తయారుచేసేవాళ్లు. కిలో రెండు వందల రూపాయల చొప్పున అమ్మేవాళ్లు. వ్యాపారం ప్రారంభించిన మొదట్లో గిరాకీ అంతగా లేదు. అయినా నిరుత్సాహ పడలేదు. ఆ తర్వాత పిండి వంటల రుచి అందరికీ తెలిసింది. దాంతో చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఆర్డర్లు మొదలయ్యాయి. ప్యూర్ నెయ్యి, పిండి వంటలకు వాడే దినుసులు, పదార్థాలు వాళ్ల వంటలను ప్రత్యేకంగా నిలిపింది. మౌత్ పబ్లిసిటీతో ఆర్డర్ల సంఖ్య పెరిగింది. దాంతో వ్యాపారం విస్తరించింది. ఇప్పుడు నిర్మల్, చుట్టుపక్కల ఊళ్లలో ‘గాయత్రి’ పిండి వంటల గురించి తెలియనవాళ్లు చాలా అరుదు.

విదేశాలకు ఆర్డర్లు..

విదేశాల్లో ఉంటున్న తమ పిల్లల కోసం పిండి వంటలు ఆర్డర్లు ఇస్తుంటారు. ఆ రుచి చూసిన అక్కడివాళ్లలో కొందరు ‘గాయత్రి’ పిండి వంటలను ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటున్నారు. ఎలాంటి స్వయం సంఘాల గ్రూపుల్లో లేనప్పటికీ, సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడ్డారు. చేయాలని ఆసక్తి, పట్టుదల ఉంటే ఎక్కడైనా రాణించవచ్చని నిరూపించారు ఈ నలుగురు మహిళలు.

సొంతడబ్బులతో..

అందరికీ తెలిసిన పిండి వంటలు తయారు చేస్తున్నాం. అవన్నీ రుచిగా ఉండటంతో మా వ్యాపారం ఆ నోటా, ఈ నోటా పాకింది. సొంత డబ్బులతోనే ఈ వ్యాపారం మొదలుపెట్టాం. ఇలాంటి బిజినెస్కు ప్రభుత్వం రుణాలు ఇస్తే బాగుంటుంది. మాలాంటివాళ్లు స్వయంగా ఉపాధి పొందుతారు. మా వ్యాపారం పెరగడంతో మా లాంటి మహిళలు ఉపాది పొందుతున్నారు.
– బి. రమాదేవి, గాయత్రి ఫుడ్స్

స్నేహితులతో కలిసి..

పిండి వంటల వ్యాపారం చేయడం సంతోషంగా ఉంది. రోజంతా ఇంట్లో ఉండి ఏం చేయాలి? ఏ పనిచేస్తే బాగుంటుంది? అని ఆలోచించి పిండి వంటల వ్యాపారం ప్రారంభించాం. ప్రతి ఐటమ్ మేమే స్వయంగా తయారుచేస్తాం. రుచిలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అందుకే మా వ్యాపారం బాగుంది. నిర్మల్ నుంచే కాకుండా, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
– బట్టు సునీత, గాయత్రి ఫుడ్స్