నిర్మల్, వెలుగు: నిర్మల్ మున్సిపల్ కు సంబంధించిన నలుగురు కో ఆప్షన్ సభ్యులను శనివారం ఎన్నుకున్నారు. చైర్ పర్సన్ అప్పాల కావ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. జనరల్ కోటా నుంచి గాజుల రవి, బీసీ కోటా నుంచి మేడారం అపర్ణ, మైనార్టీ కోటా నుంచి అస్మా బేగం, నోమన్ అలీని కౌన్సిలర్లు చేతులెత్తి ఎన్నుకున్నారు.
మొత్తం నాలుగు కో ఆప్షన్ పదవుల కోసం 42 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ ఉన్న నేపథ్యంలో అదే పార్టీకి చెందిన ఈ నలుగురు కూడా పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. ఎన్నికైన కోఆప్షన్ సభ్యులను కమిషనర్ రవిబాబు, వైస్ చైర్పర్సన్ గణేశ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్ సన్మానించారు.
