
- వరుసగా 13 ట్వీట్లలో సమాధానం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన అప్పుల ఎగవేతదారుల లిస్ట్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. వరుసగా 13 ట్వీట్లు చేసి సమాధానం చెప్పారు. రాహుల్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని నిర్మల విమర్శించారు. బ్యాంకులు ఎవరి రుణాలను మాఫీ చేయలేదని, చెల్లించే కెపాసిటీ ఉన్నా కావాలనే ఎగొట్టిన వారిని ‘విల్ ఫుల్ డీఫాల్టర్లు’గా గుర్తించిందని అన్నారు. దీనిపై క్లారిటీ కావాలంటే మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్‌సింగ్‌ను అడగాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా వ్యవహరించిన రఘురామ్ రాజన్ చేసిన కామెంట్స్‌ను కూడా ఆమె కోట్ చేశారు. “ రఘురామ్ రాజన్ మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2006–08 మధ్యలోనే మొండి బకాయిలు ఎక్కువగా నమోదయ్యాయి. రుణాలు ఎగొట్టిన చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చాలా ఎక్కువ అప్పులు ఇచ్చారు” అని నిర్మల అన్నారు. 2009–10, 2013– 14 మధ్య షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు 1,45,226 కోట్లను మాఫీ చేశాయని గుర్తు చేశారు. నాటి యూపీఏ ఫోన్ బ్యాకింగ్ ద్వారా లాభపడిన వారే డిఫాల్టర్లుగా మారారని నిర్మలా సీతారామన్ విమర్శించారు. ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్య, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీలను ఆర్థికనేరగాళ్లుగా ప్రకటించడంతో పాటు వారికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి వారిని మన దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె ట్వీట్ చేశారు. మన దేశంలోని బ్యాంకులను, ఇతర ఫైనాన్షియల్ సంస్థలను మోసం చేసి.. అప్పుడు ఎగ్గొట్టిన 50 మంది లిస్టును ఆర్‌బీఐ రిలీజ్ చేయగా.. రాహుల్ గాంధీ దానిపై కామెంట్ చేశారు. 50 మంది బీజేపీ స్నేహితులే అని అన్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ప్రశ్నిస్తే లిస్ట్ ఇవ్వలేదని, తమ స్నేహితులు ఉన్నారు కాబట్టే చెప్పలేదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.