రాహుల్‌‌ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలి..లోక్‌‌సభలో నోటీసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ

రాహుల్‌‌ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలి..లోక్‌‌సభలో నోటీసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ
  • డిస్‌‌క్వాలిఫై చేసే ప్రక్రియను ప్రారంభించాలని వినతి

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌లో రాహుల్ గాంధీ  నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్ సభలో ఫిర్యాదు చేశారు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ స్పీకర్‌‌‌‌కు నోటీసులిచ్చారు. డిస్‌‌క్వాలిఫై చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ.. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిందని రాహుల్ అబద్ధాలు ప్రచారం చేస్తూ విదేశీ శక్తులకు మేలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఇంకా పబ్లిష్‌‌ కాని బుక్​ రాహుల్‌‌ చేతికి ఎలా వచ్చింది” అని ప్రశ్నించారు.

సభా హక్కుల తీర్మానం తీసుకురావట్లే

రక్షణ, ఆర్థిక, వాణిజ్య లేదా విదేశీ వ్యవహారాలు ఇలా ఏదైనా కావచ్చు.. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయాలనే ఉద్దేశంతో  రాహుల్ గాంధీ వివాదాలు సృష్టించడానికి ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదని దూబే పేర్కొన్నారు. ‘‘రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ దేశాన్ని లోపలి నుంచి అస్థిరపరిచే ప్రయత్నం తప్ప మరేమీ కాదు” అని పేర్కొన్నారు.  అయితే, రాహుల్‌‌ గాంధీపై సభా హక్కుల తీర్మానం తీసుకురావడం లేదని దూబే స్పష్టం చేశారు.   

దీటుగా స్పందించిన కాంగ్రెస్‌‌

 బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కొట్టిపారేసింది. ‘‘గతంలో కూడా రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేశారు, కానీ ప్రజలు ఆయనను అంతకంటే భారీ మెజారిటీతో గెలిపించారు. ఇలాంటి బెదిరింపులకు మేం భయపడం” అని కాంగ్రెస్‌‌ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. నిషికాంత్ దూబేకు మంత్రి పదవి కావాలని, అందుకే రాహుల్ పేరును వాడుకుంటూ ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారని ఎంపీ రేణుకా చౌదరి విమర్శించారు. అసలు బీజేపీ ఎంపీలకు ప్రివిలేజ్‌‌ మోషన్​ అంటే తెలుసా? అని ఆమె ప్రశ్నించారు.

లోక్‌‌సభ వాయిదా

రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలతో లోక్‌‌సభలో దుమారం రేగింది. దూబే వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి.  దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. గురువారం లోక్‌‌సభ రోజంతా వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగా..  ‘ప్రశ్నోత్తరాల సమయం’లో భారత్-అమెరికా  మధ్య ట్రేడ్‌‌ డీల్‌‌, 4  కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. ఆ తర్వాత నిషికాంత్ ​దూబే వ్యాఖ్యలపై ఆందోళన నెలకొన్నది.