ఇక టోల్ ప్లాజాల దగ్గర ఆగనక్కర్లేదు..ఏడాదిలోపు ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లు

ఇక టోల్ ప్లాజాల దగ్గర ఆగనక్కర్లేదు..ఏడాదిలోపు ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లు
  •  ఏడాదిలో కొత్త ఎలక్ట్రానిక్ టోల్ వసూలు: నితిన్ గడ్కరీ
  • ఇప్పటికే పైలట్​గా 10  ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్టు వెల్లడి

    

న్యూఢిల్లీ: ఇకపై టోల్ చెల్లింపుల కోసం టోల్ ప్లాజల వద్ద మీ వాహనాలు ఆపాల్సిన అవసరం ఉండదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. టోల్ చెల్లింపుల కోసం కొత్త వ్యవస్థను అమలులోకి తీసుకువస్తున్నట్టు గురువారం పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం నిలిపేసి మరో ఏడాదిలోపు ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు.

 ఈ కొత్త ఎలాక్ట్రానిక్ టోల్ వ్యవస్థను ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 10 ప్రదేశాలలో ప్రవేశపెట్టామన్నారు. ఏడాది లోపు దేశవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని వివరించారు. ‘‘ప్రస్తుతం ఉన్న టోల్ చెల్లింపు వ్యవస్థ ముగుస్తుంది. టోల్ పేరుతో మిమ్మల్ని ఆపడానికి ఎవరూ ఉండరు. ఒక సంవత్సరం లోపు, దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లు అమలులోకి వస్తాయి’’ అని గడ్కరీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రూ. 10 లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని కూడా గడ్కరీ చెప్పారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్​ఈటీసీ) ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేసింది, ఇది దేశ హైవేలపై టోల్ వసూలును రెగ్యులరైజ్ ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపుల కోసం తీసుకొస్తున్న ఏకీకృత ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్.