- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిసోర్సెస్‌లో టాప్
- సైబర్ నేరాల నియంత్రణ, శాంతిభద్రతలపై మరింత దృష్టి పెట్టాలని సూచన
- లాజిస్టిక్స్‌పై ఫోకస్ పెరగాలని సలహా
- ద్వితీయ శ్రేణి నగరాలకు పారిశ్రామిక విస్తరణ.. ఆర్ అండ్ డీలపై దృష్టి పెట్టాలన్న నీతి ఆయోగ్ నివేదిక
హైదరాబాద్, వెలుగు: నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్‌లో దేశంలోని పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ‘ఫ్రంట్‌రన్నర్’ కేటగిరీలో నిలిచింది. తాజాగా విడుదల చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్-2026 నివేదిక ప్రకారం, మొత్తం 100 పాయింట్లకు గాను 47.3 స్కోరు సాధించి జాతీయ స్థాయిలో 13వ ర్యాంకును కైవసం చేసుకున్నది.
రాష్ట్రం ఒకవైపు మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విప్లవంలో ప్రతిభ కనబరుస్తూనే, మరోవైపు సంస్థాగత లోపాలు, కొన్ని కీలక విభాగాల్లో పొరుగు రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కొనేందుకు మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉందని నివేదిక సూచించింది. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న సాంకేతిక, పారిశ్రామిక రంగం రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టగా, క్షేత్రస్థాయిలో ఇంకా బలోపేతం కావాల్సిన అంశాలను కూడా నివేదిక తెలియజేసింది.
రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి
వివిధ విభాగాల వారీగా పరిశీలిస్తే.. మౌలిక వసతుల కల్పన విభాగంలో తెలంగాణ 10.5 స్కోరును సాధించింది. ఐటీ రంగ విస్తరణ, డిజిటల్ మౌలిక వసతుల కల్పనలో చూపిన చొరవ ఈ విభాగంలో మెరుగైన స్కోరుకు కారణమైంది. బిజినెస్ క్లైమేట్ పిల్లర్‌లో రాష్ట్రం 7.8 స్కోరును నమోదు చేసింది. ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ బలోపేతం కావడం, కొత్త స్టార్టప్‌ల నమోదు వేగంగా సాగడం, సులభంగా బ్యాంకింగ్ క్రెడిట్ లభించే సదుపాయాలు ఉండడం ఇందుకు తోడ్పడ్డాయి.
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు ద్వారా పాఠశాల స్థాయి నుంచే ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఎగుమతుల రంగంలో వాటాను పెంచుకుంటూ పోవడం ఈ విభాగంలో కలిసివచ్చాయి. సహజ, మానవ వనరుల లభ్యత విషయానికి వస్తే తెలంగాణ 6.6 స్కోరు సాధించింది. రాష్ట్రంలో లభ్యమవుతున్న నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, స్టెమ్ విద్యలో విద్యార్థుల నమోదు దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ మెరుగ్గా ఉంది.
అయితే, ప్రభుత్వ విధానాల పరంగా చూస్తే రాష్ట్రం 3.6 స్కోరుకు పరిమితమైంది. నూతన పారిశ్రామిక పాలసీల ద్వారా రాయితీలు ఇస్తున్నప్పటికీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) రంగానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత పెంచాల్సి ఉందని నివేదిక సూచించింది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ సంస్థలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నది.
ఇన్‌స్టిట్యూషనల్ ఎన్విరాన్‌మెంట్‌లో బ్యాక్..
రాష్ట్రం సాధించిన విజయాలు ఒకవైపు ఉంటే, సంస్థాగత వాతావరణం పిల్లర్‌లో మాత్రం తెలంగాణ 2.9 స్కోరుతో వెనుకబడింది. శాంతిభద్రతల సమర్థవంతమైన నిర్వహణ, కార్మిక వివాదాల వేగవంతమైన పరిష్కారంలాంటి అంశాల్లో రాష్ట్రం మరింత దృష్టి పెట్టాల్సి ఉందని నివేదిక తేల్చింది. ముఖ్యంగా పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణ, ఆర్థిక నేరాల అదుపుపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎన్విరాన్‌మెంట్ రెసిలియెన్స్ పిల్లర్‌లో రాష్ట్రం 3.8 స్కోరు సాధించింది. ప్రకృతి విపత్తుల నిర్వహణ, కాలుష్య నియంత్రణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. గ్రీన్, రెన్యువెబుల్ ఎనర్జీ రంగాల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పర్యావరణ అనుకూల పార్కుల ఏర్పాటును ముమ్మరం చేయాలని స్పష్టం చేసింది.
రెగ్యులేటరీ ఈజ్ పిల్లర్‌లో తెలంగాణ 7.5 స్కోరును కైవసం చేసుకున్నది. వ్యాపారాల స్థాపనకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, సింగిల్ విండో విధానం ద్వారా సేవలు అందించడం ఇందుకు దోహదం చేశాయి. విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్ల జారీలో వేగం పెరిగిందని, ఆర్థిక ఆరోగ్యం (ఫైనాన్షియల్ హెల్త్) విభాగంలో తెలంగాణ 4.7 స్కోరు సాధించింది.
రాష్ట్ర జీఎస్‌డీపీలో అప్పుల శాతం, ద్రవ్య లోటు నిర్వహణలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ స్కోరు కేటాయించారు. బడ్జెట్ అంచనాలకు లోబడి నిధుల వ్యయం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో రాష్ట్రం మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పారిశ్రామిక రాయితీలను సకాలంలో విడుదల చేయాల్సి ఉంది.
పోటీనిస్తున్న పొరుగు రాష్ట్రాలు
దక్షిణాది రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ కొన్ని కీలక విభాగాల్లో పోటీని ఎదుర్కొంటున్నది. తమిళనాడు 53.3 స్కోరుతో దేశంలోనే 3వ ర్యాంకు సాధించగా, ఏపీ (48.7 స్కోరు, 8వ ర్యాంకు), కర్నాటక (48.7 స్కోరు, 9వ ర్యాంకు) తెలంగాణ కంటే ముందంజలో నిలిచాయి. ముఖ్యంగా సంస్థాగత వాతావరణంలో చత్తీస్‌గఢ్ 4.5 స్కోరుతో, తమిళనాడు 4.2 స్కోరుతో టాప్‌లో ఉండగా, తెలంగాణ వెనుకబడి ఉంది. మౌలిక సదుపాయాల పరంగా తమిళనాడు 13.6, కేరళ 12.6, ఏపీ 12.1తో తెలంగాణ (10.5) కంటే మెరుగ్గా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలకు ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం, ఓడరేవుల కనెక్టివిటీ వారికి కలిసి రాగా, తెలంగాణ ల్యాండ్‌లాక్డ్ రాష్ట్రం అయినందున లాజిస్టిక్స్ వేగాన్ని పెంచడంపై మరింత దృష్టి సారించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రాయితీల కేటాయింపుల విభాగంలో మధ్యప్రదేశ్ 5.4 స్కోరుతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవగా, తెలంగాణ 3.6 స్కోరుతో వెనుకబడింది. కర్నాటక, తమిళనాడులాంటి రాష్ట్రాలు ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో పోటీ ఇస్తున్న తరుణంలో, తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు (టైర్-2, టైర్-3) కూడా పారిశ్రామిక ప్రోత్సాహకాలను విస్తరించాలని నివేదిక పేర్కొన్నది. మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచడం, ఆర్ అండ్ డీ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచడం ద్వారానే మరింత వృద్ధిని సాధించగలదని స్పష్టం చేసింది
