న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ సిన్హా(46 ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో పార్టీ నేతలు నితిన్ నబిన్‌ను బలపరిచారు. బీజేపీ సంఘటన్ పర్వ్‌లో భాగంగా జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి నితిన్ నబిన్‌కు మద్దతుగా మొత్తం 37సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు జాతీయ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ ప్రకటించారు.
ప్రత్యర్థిగా ఎవరు బరిలో నిలవకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు దీన్ దయాల్ మార్గ్ లోని హెడ్ ఆఫీసులో నితిన్ నబిన్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం పార్టీ చీఫ్ గా ఉన్న జేపీ నడ్డా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రభుత్వంలోనూ కీలక శాఖలు...
బిహార్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నబిన్.. ప్రభుత్వంలోనూ తన మార్క్ ను చాటుకున్నారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణాలు, న్యాయశాఖ, పట్టణాభివృద్ధి– గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధత్యలు నిర్వహించారు. నూతన బాధ్యతలు చేపట్టనున్న నబిన్ కు ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో కాషాయ జెండాలను పాతాలని, అస్సాంలో మళ్లీ అధికారం నిలుపుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు డీలిమిటేషన్, పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం మహిళా కోటా అమలు వంటి ముఖ్యమైన మార్పుల మధ్య 2029 లోక్ సభ ఎన్నికల వైపు పార్టీని నడింపించే బాధ్యత నబిన్ ముందుంది.
నబిన్ కు మద్దతుగా 37 సెట్లు...
కొత్త బాస్ ను ఎన్నుకోవాలంటే మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని కనీసం 50 శాతం ప్రాంతాల్లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వాలనే నింబధన పార్టీలో ఉందని జాతీయ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం పార్టీ నామినేషన్లు, పరిశీలన ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన ఓ ప్రకటనలో వెలువరించారు. 30 ప్రాంతాల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ నెల16న ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ఎలక్టోరల్ రోల్‌ను ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నితిన్ నబిన్‌కు మద్దతుగా మొత్తం 37 సెట్‌ల నామినేషన్ పత్రాలు అందాయని వివరించారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువు ముగిసిన తర్వాత.. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నితిన్ నబిన్ కు ఏకగ్రీవమైనట్లు ప్రకటించామని లక్ష్మణ్ పేర్కొన్నారు. కాగా..కొత్త బాస్ కోసం జరిగిన ఎన్నికల ప్రక్రియలో ప్రస్తుత చీఫ్ జేపి నడ్డా కూడా పాల్గొన్నారు. నితిన్ నబిన్ కు మద్దతుగా కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో కలిసి ఒక సెట్ నామిషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు అమిత్ షా, భూపేంద్ర యాదవ్, పియూష్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే..నితిన్ నబిన్ కు మద్దతుగా తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఒక నామినేషన్ సెట్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇందులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అతి పిన్నవయస్కుడిగా...
ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన నబిన్.. 46 ఏండ్ల వయసులోనే బీజేపీకి 12 వ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దాంతోఈ పదవికి ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా నబిన్ రికార్డు సృష్టించారు. అలాగే.. బిహార్ నుంచి పార్టీ అధ్యక్ష స్థాయికి ఎదిగిన తొలి నేతగా నిలిచారు. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబిన్.. తండ్రి మరణం తర్వాత 2006 లో పాట్నా వెస్ట్ నుంచి బై ఎన్నికలో గెలిచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి 2010, 2015, 2020, 2025(తాజాగా) వరుసగా బాంకిపుర్ స్థానాన్ని నిలుపుకున్నారు.నబిన్.. పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు. గతంలో బీజేపీ యువ మోర్చా(బీజేవైఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేవైఎం బిహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
