పాట్నా: జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీఏ శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం (నవంబర్ 19) బీహార్ రాజధాని పాట్నాలో ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. దిలీప్ జైస్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారీలతో సహా ఎన్డీఏ కూటమిలోని 202 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా నితీష్ కుమార్ పేరును సమరత్ చౌదరి ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలు అందరూ నితీష్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో నితీష్ కుమార్ ఎన్డీఏ శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్డీఏ భాగస్వాముల మద్దతు లేఖను బుధవారం (నవంబర్ 19) సాయంత్రం గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా నితీష్ కుమార్ కోరనున్నారు. గురువారం (నవంబర్ 20) ఉదయం 11.30 గంటలకు పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 75 ఏళ్ల నితీష్ కుమార్ 10వ సారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్ సీఎం ప్రమాణస్వీకారోత్స కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఎన్డీఏ భాగాస్వామ్య నేతలు హాజరుకానున్నారు.
కాగా, ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేృత్వత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ సీట్లగానూ 202 స్థానాలు దక్కించుకుని కనివినీ ఎరుగని గెలుపు నమోదు చేసింది. బీజేపీ 89 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 సీట్లలో గెలుపొందింది. ఎల్జేపీ (ఆర్వీ)19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో విజయం సాధించాయి.
