IND vs NZ: ఆ ఇద్దరిలో ఎవరికి చోటు..? ఆరో స్థానం కోసం ఆల్ రౌండర్ల మధ్య పోటాపోటీ.. ఎవరికి ఎంత ఛాన్స్

IND vs NZ: ఆ ఇద్దరిలో ఎవరికి చోటు..? ఆరో స్థానం కోసం ఆల్ రౌండర్ల మధ్య పోటాపోటీ.. ఎవరికి ఎంత ఛాన్స్

న్యూజిలాండ్ తో జరగబోయే తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11 లో ఒక స్థానంపై సందిగ్ధత నెలకొంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా వడోదర వేదికగా తొలి వన్డే ఆదివారం (జనవరి 11) జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆరో స్థానంలో ఎవరిని ఆడించాలో జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. టీమిండియా తుది జట్టులో టాప్-5 ఫిక్సయిపోయారు. రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ ఇలా ఎవరినీ జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి. ఏడో స్థానంలో సీనియర్ ఆల్ రౌండర్ జడేజా స్థానం గ్యారంటీ. ఆరో స్థానంలో వాషింగ్ టన్ సుందర్ లేదా నితీష్ కుమార్ రెడ్డిలలో ఒక్కరికే ఛాన్స్ దక్కనుంది.
 
స్పిన్ ఆల్ రౌండర్ గా సుందర్: 

తొలి వన్డేకు టీమిండియా తుది జట్టులో కుల్దీప్ యాదవ్, జడేజా రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉండడం ఖాయం. కుల్దీప్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా.. జడేజా స్పిన్ ఆల్ రౌండర్ గా జట్టులో ఉంటాడు. వాషింగ్ టన్ సుందర్ కు ఛాన్స్ ఇస్తే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో ఆడాల్సి వస్తుంది. స్పిన్ ట్రాక్ కావడంతో సుందర్ కు జట్టులో అవకాశం దక్కొచ్చు. అద్భుతమైన స్పిన్ తో పాటు ఇటీవలే బ్యాటింగ్ లో ఈ తమిళనాడు ఆల్ రౌండర్ చాలా మెరుగయ్యాడు. అయితే టీమిండియా చివరిసారిగా సౌతాఫ్రికాతో ఆడిన వన్డే సిరీస్ లో సుందర్ విఫలం కావడం అతనికి మైనస్ గా మారనుంది. 

నితీష్ ను తీసుకుంటారా..?

భారత జట్టులో ఉన్న ఏకైక ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావడం తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి అడ్వాంటేజ్. నితీష్ జట్టులో ఉంటే ముగ్గురు పేసర్లతో పాటు బౌలింగ్ భారాన్ని పంచుకుంటాడు. ఆరో బౌలర్ గా 5 నుంచి 7 ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలడు. బౌలింగ్ కంటే బ్యాటింగ్ లో బాగా రాణించడం నితీష్ కు కలిసొచ్చే అంశం. అయితే ఇటీవలే వరుసగా ఈ తెలుగు కుర్రాడికి గాయాలు ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు గాయపడతాడో చెప్పలేని పరిస్థితి. అన్నిటికంటే నితీష్ ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడా లేదా అనేది పెద్ద ప్రశ్న. దీంతో నితీష్ కు తొలి వన్డేలో ఛాన్స్ దక్కే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. 

న్యూజిలాండ్ తో తొలి వన్డేకు ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్